How to Find Adulteration in Green Vegetables: ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన ఆహారమే తినాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్‌కు వెళ్తే.. తాజాగా నిగనిగలాడుతున్న ఆకుపచ్చటి కూరగాయలు, తాజాపండ్లను ఎంచుకుంటుంటారు. కూరగాయలు ఎంత పచ్చగా ఉంటే.. అవి అంత తాజావి అనుకుంటారు. కానీ.. ఆ పచ్చటి కూరగాయల్లో.. కల్తీ విషం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూరగాయలు తాజాగా కనిపించేందుకు.. మలాకైట్ గ్రీన్, కాపర్ సల్ఫేట్, రోడమైన్ బి, కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో ఆహారాన్ని విస్తృతంగా కల్తీ చేస్తున్నారని చెబుతున్నారు. మరి, ఆకుపచ్చదనం వెనుక కల్తీ ఉందో? లేదో? తెలుసుకోవడం ఎలా? అంటే.. అందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సూచనలు చెబుతోంది. అవి ఇప్పుడు చూద్దాం..
మలాకైట్ గ్రీన్ అంటే ఏమిటి:మలాకైట్ గ్రీన్ ఒక టెక్స్‌టైల్ డై అని.. దీనిని చేపలకు యాంటీప్రొటోజోల్, యాంటీ ఫంగల్ మందుగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది జల జీవులపై ఏర్పడే ఫంగల్ దాడులు, ప్రోటోజోవాన్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. అయితే మిరపకాయలు, బఠానీలు, పాలకూర వంటి కూరగాయలు పచ్చగా కనిపించేలా చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారని చెబుతున్నారు.
ఇది ఎందుకు ప్రమాదకరం: నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ రంగు విషపూరితం. ఇది కార్సినోజెనిసిస్, మ్యూటాజెనిసిస్, క్రోమోజోమల్ ఫ్రాక్చర్, టెరాటోజెనిసిటీ, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుందని వివరిస్తున్నారు.
కల్తీ ఎలా కనిపెట్టాలి:
కూరగాయల్లో మలాకైట్ గ్రీన్‌ను గుర్తించడం:
- ముందుగా ఓ దూది ఉండను తీసుకుని నీరు లేదా వెజిటేబుల్ ఆయిల్ ముంచాలి. లిక్విడ్ పారాఫిన్‌లో ముంచిన దూదిని అయిన తీసుకోవచ్చు.
- ఇప్పుడు ఆ కాటన్ బాల్ సాయంతో బెండకాయలను తుడిచి చూడండి..
- దూది రంగు మారకుంటే అవి తాజావి.. రంగు మారిందంటే అవి మలాకైట్ గ్రీన్‌తో కల్తీ జరిగినట్లు అర్థం. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడం మంచిది.