Who Is Rekha Gupta : దిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు దిల్లీ సీఎం పగ్గాలు అప్పగించింది.
ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా బీజేపీలో పలు విభాగాల్లో క్రియాశీలంగా పనిచేశారు. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా కూడా గతంలో సేవలందించారు. రేఖా గుప్తా దిల్లీకి నాలుగో మహిళా సీఎంగా సేవలందించనున్నారు. గతంలో సుష్మాస్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
జులై 19, 1974లో హరియాణాలోని జుల్నాలో జన్మించిన రేఖా గుప్తా, చిన్న వయసులోనే ఆరెస్సెస్ భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. దిల్లీ వర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ సమయంలోనే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. 1996లో దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు.
విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై దృష్టిసారించి పనిచేశారు. ఈ క్రమంలోనే 2007, 2012లలో రెండుసార్లు ఉత్తరి పీతమ్‌పుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. దిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు.
రేఖా గుప్తాకు అభినందనల వెల్లువ
- "బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన రేఖా గుప్తాకు హృదయపూర్వక అభినందనలు. దిల్లీని ప్రపంచంలోని అగ్ర రాజధానుల్లో ఒకటిగా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం దిశగా మీరు అంకిత భావంతో పనిచేస్తారని నంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీ సారథ్యంలో దిల్లీలోని తల్లులు, సోదరీమణుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాత్రింబవళ్లు కృషిచేస్తారని నమ్ముతున్నా"- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
- "రేఖా గుప్తాకు అభినందనలు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నా. దిల్లీలో అభివృద్ధి పనులకు భాజపాకు తమ మద్దతు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పదలచుకున్నా. రేఖాగుప్తా నాలుగో మహిళా సీఎంగా ఉండటం మంచి విషయం. మహిళలు రాజకీయాల్లో ఎంతో గొప్ప ఉత్సాహంతో కనబడుతున్నారు"- ఆప్ నేత, ఆపద్ధర్మ సీఎం ఆతిశీ
- "దిల్లీ సీఎంగా ఎంపికైన రేఖా గుప్తాకు అభినందనలు. దిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమె నెరవేరుస్తారని ఆశిస్తున్నా. దిల్లీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేసే ప్రతి పనికీ మేం మద్దతు ఇస్తాం"- ఆప్ అధినేత కేజ్రీవాల్