Uric Acid Reducing Foods: ఈ మధ్య కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడం వల్ల నొప్పితో పాటు గౌట్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక మందులతో పాటు ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. యూరిక్ యాసిడ్ స్థాయులను తగ్గేలా చేస్తాయని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటి? వాటిని ఎప్పుడు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
యూరిక్ యాసిడ్ ఎలా ఏర్పడుతుంది:మనం రోజూ తీసుకునే ఆహారంలోని ప్రొటీన్ల నుంచి ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెంది యూరిక్ యాసిడ్‌గా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడూ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కాగా, అంతే స్థాయిలో మూత్రం ద్వారా సరిగ్గా బయటకు వెళ్లనప్పుడు సమస్య వస్తుంది. యూరిక్ యాసిడ్ విసర్జన సరిగ్గా జరగక అది రక్తంలోని నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన యూరిక్ యాసిడ్ స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి హైపర్ యూరిసిమియాకు దారి తీస్తుంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వాల్నట్స్: ఇందులో పుష్కలంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాపు, నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా యూరిక్ యాసిడ్‌ను తొలగించి కిడ్నీ పనితీరును మెరుగపరచడంలోనూ సాయపడుతుందని వెల్లడిస్తున్నారు.

ఎప్పుడు తినాలి?: 2-3 వాల్‌నట్స్‌ను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టాలి. అనంతరం పరగడుపునే తినవచ్చని లేదా స్మూతీలు, సలాడ్‌తో పాటు తీసుకోవాలని చెబుతున్నారు.
పిస్తా: పిస్తాల్లో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి యూరిక్ యాసిడ్, వాపు పెరిగేందుకు కారణమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడుతుందని వివరిస్తున్నారు. ఇంకా ఇందులోని ఆరోగ్యకరమైన పోషకాలు జీర్ణక్రియను మెరుగపరచడంలో సాయపడతాయని తెలిపారు.

ఎప్పుడు తినాలి?: సుమారు 15 పిస్తాలను ఉదయాన్నే తినాలని చెబుతున్నారు. అయితే, వీటిని వేయించకుండా, ఎలాంటి ఉప్పు లేకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పుతో తీసుకుంటే కిడ్నీ పనితీరుపై చెడు ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
బాదం: బాదంలో జీర్ణక్రియను పెంచే, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను అదుపులో పెట్టే మెగ్నీషియం పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంతో పాటు కిడ్నీ పనితీరును పెంచుతుందని వివరిస్తున్నారు. 2019లో Journal of Nutrition and Metabolismలో ప్రచురితమైన "Almond consumption decreases uric acid levels in healthy adults" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎప్పుడు తినాలి?: 5-6 బాదంను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటి పొట్టును తీసి ఖాళీ కడుపుతో తినాలని చెబుతున్నారు. అలా తినలేకపోతే మిక్సీ పట్టి పాలల్లో లేదా ఓట్ మీల్లో కలిపి తాగాలని అంటున్నారు.
జీడిపప్పు: మెగ్నీషియంతో పాటు హెల్దీ ఫ్యాట్ లభించే అద్భుతమైన పదార్థాల్లో జీడిపప్పు ఒకటి. ఇవి వాపును తగ్గించడంతో పాటు జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో ప్యూరిన్స్ తక్కువగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుందని వివరిస్తున్నారు.

ఎప్పుడు తినాలి?: ఉదయాన్నే 4-5 జీడిపప్పులను ఎలాంటి ఉప్పు లేకుండానే తినాలని చెబుతున్నారు. వీలైతే ఇతర నట్స్‌తో తీసుకుంటే సమతుల పోషకాలు అందుతాయని తెలిపారు.
డేట్స్ (ఖర్జూర): ఇందులో ఫైబర్, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రెండూ యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంతో పాటు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు. ఇంకా సహజంగానే శక్తిని పెంచేలా చేస్తుందని వివరిస్తున్నారు.

ఎప్పుడు తినాలి?: ఉదయాన్నే 1-2 డేట్స్ నేరుగానే తినాలని లేదా స్మూతీలు, సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చని చెబుతున్నారు.
బ్రెజిల్ నట్స్: ఇందులో వాపును తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్న సెలీనియం పుష్కలంగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఇది యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు.
ఎప్పుడు తినాలి?: రోజూ 1-2 బ్రెజిల్ నట్స్ తినాలని.. అతిగా తింటే సెలీనియం శరీరానికి హానికరమని అంటున్నారు. ఉదయాన్నే నేరుగా లేకపోతే గ్రైండ్ చేసి తీసుకోవచ్చని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
యూరిక్ యాసిడ్‌తో ఇబ్బందా? అసలు గౌట్ ఎలా వస్తుందో తెలుసా? తాజా పరిశోధనలో కీలక విషయాలు
ఇవి తింటే యూరిక్ యాసిడ్ ఈజీగా తగ్గిపోతుందట! గౌట్ సమస్యకు బెస్ట్ డైట్ ఇదే!