Indian Fishermen Released Pakistan Jail : పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడం వల్ల కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం బయటకు వచ్చారు. ఈ రోజే ఆ మత్స్యకారుల్ని భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో భారత జాలర్లకు ఈది ఫౌండేషన్ సహాయసహకారాలు అందించింది. వారు కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లడానికి కావాల్సిన రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వారు భారత్‌కు రానున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణ ఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది. ఈ సందర్భంగా భారత్-పాక్ ప్రభుత్వాలకు ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది ఒక అభ్యర్థన చేశారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని అభ్యర్థించారు.
వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు ఈ జాలర్లను భారత్‌కు అప్పగిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లుచేస్తారు. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్ల ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది.