How Planets Affect Child Birth as per Astrology : సాధారణంగా మహిళల్లో గర్భవిచ్ఛిత్తికి జన్యుపరమైన కారణాలే ఉంటాయని చాలామంది భావిస్తుంటారని, కానీ గ్రహాల ప్రభావం కూడా ఉంటుందని, అది అబార్షన్కి కూడా దారితీయొచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు నిట్టల ఫణిభాస్కర్ చెబుతున్నారు. అంతేకాదు, నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రీ-మెచ్యూర్ బేబీస్కి జన్మనివ్వడం వెనుక కూడా గ్రహాల ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మొదటి నెల గర్భానికి శుక్ర గ్రహం ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి, శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే ఆలస్యంగా వివాహాలు జరుగుతుండడం, కొంతమందిలో సంతానం ఆలస్యమవ్వడానికి కారణమవుతుందట. అలాగే, చాలా మందిలో మొదటి నెలలోనే అబార్షన్ అవ్వడానికి ఇదే కారణమట.
- రెండో నెలలో కుజ గ్రహ ఆధిపత్యం ఉంటుంది. అయితే, కొందరికి గర్భం నిలవక రెండో నెలలో అబార్షన్ అవుతుంటుంది. అలా జరగడం వెనక కుజ గ్రహం బలహీనంగా ఉండడమే కారణమట. జాతకంలో సర్ప దోషాలు ఉండడం కూడా కారణం అవ్వొచ్చంటున్నారు.
- మూడో నెల గర్భానికి దేవ గురువైన బృహస్పతి/గురు గ్రహం అధిపతిగా ఉంటాడు. సంతానానికి కారణమైనటువంటి గ్రహం బృహస్పతి. ఈ నెలలో చాలా మందికి గర్భం నిలవక గర్భస్రావం అవ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. గురుడు బలహీనంగా ఉండడం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయట.
- నాలుగో నెల గర్భానికి రవి గ్రహం ఆధిపత్యం వహిస్తారు. ఈ నెలలో శిశువు ఎముకలు ఏర్పడడం ప్రారంభమవుతుంటుంది. అయితే, నాలుగో నెలలో ఎవరికైనా పితృ దోషాలుంటే, సూర్యుడు వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తున్నట్లయితే గర్భిణులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందట.
- ఐదో నెలలో చంద్ర గ్రహం అధిపతిగా ఉంటాడు. ఈ నెలలో శిశువు చర్మం ఏర్పడడం, పిండం గట్టి పడడం జరుగుతుంటుంది. కాబట్టి, ఈ సమయంలో చంద్రుడు సరిగ్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవట.
- ముఖ్యంగా నాలుగు, ఐదో నెలల్లో గ్రహణాలు ఏర్పడిన సమయాల్లో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందట.
- గర్భిణులకు ఆరో నెల చాలా కీలకం. ఈ నెలలో శనేశ్వరుడు ఆధిపత్యం వహిస్తారు. ఈ సమయంలో శిశువుకి వెంట్రుకలు రావడం, అవయవాలు రూపొందడం, పెరుగుతూ ఉండడం జరుగుతుంటుంది. అదే, శనేశ్వరుడు సరిగ్గా లేకపోవడం, ఏలినాటి శని బాధ అనుభవిస్తుండడం లేదా శని గ్రహం బలహీనంగా ఉండడం మూలంగా కొందరిలో ఈ నెలలో ప్రసవ సమస్యలు వస్తాయంటున్నారు.
- ఏడో నెలలో శిశువుకు జ్ఞానేంద్రియాలు ఏర్పడుతుంటాయి. అలాగే, శిశువు ఆయుర్థాయం, ఎలాంటి జీవనాన్ని సాగించాలనేదీ ఈ నెలలోనే డిసైడ్ అవుతుందట. ఇవన్నీ జరిగే ఈ సమయంలో బుధుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ నెల చాలా కీలకమంటున్నారు.
- ఎనిమిదో నెల కూడా గర్భిణులకు అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు. ఈ నెలలోనే ప్రీ-మెచ్యూర్ బేబీస్ పుడుతూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయమేమిటంటే గర్భాదానం చేసే సమయానికి లగ్న శుద్ధి లేకపోయినా లేదా స్త్రీ, పురుషుల రవి చంద్రులకు సంబంధించి తగు రీతిలో నిర్ణయం జరగకపోయినా వాటి వల్ల కలిగే దోషాల మూలంగా ప్రీ మెచ్యూర్ బేబీస్ పుడతారట. తత్ఫలితంగా భవిష్యత్తులో పిల్లలు కొంత ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు.
- ఎనిమిదో నెలలో లగ్నాధిపతి ఆధిత్యం వహించిన అనంతరం వరుసగా తొమ్మిది, పది నెలల్లో సూర్య, చంద్ర గ్రహాలు అధిపత్యం వహిస్తారు. గర్భిణులపై గర్భం ధరించిన మొదటి నెల నుంచి తొమ్మిది లేదా పదో నెల గర్భం వచ్చే వరకు ఈవిధంగా ఒక్కొక్క గ్రహం ప్రభావం చూపిస్తుందని వివరిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు నిట్టల ఫణిభాస్కర్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
పెళ్లై ఏళ్లు గడిచినా సంతానం లేదా? - ఈ వ్రతం చేస్తే తప్పక పిల్లలు పుడతారు!
పిల్లలు పుట్టడంలేదని బాధపడుతున్నారా? దంపతులిద్దరూ ఇది తాగితే సంతానం కలిగే ఛాన్స్!