How to get LRS subsidy in TG : పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు(ఎల్‌ఆర్‌ఎస్) సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం వరకు రాయితీ ఇస్తుండటం ప్లాట్ల యజమానులకు పెద్ద ఊరట. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో వీటి రిజిస్ట్రేషన్లు ఊపందుకోనున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొందేందుకు అర్హులు ఎవరంటే? : 26 ఆగస్టు 2020కు ముందు ఎల్‌ఆర్‌ఎస్(అక్రమ లేఅవుట్లను ఈ స్కీం) కింద క్రమబద్ధీకరిస్తారు. అయితే లేఅవుట్‌లోని ప్లాట్లలో కనీసం 10 శాతం ఇప్పటికే విక్రయించి ఉండాలి. అలాంటి లేఅవుట్‌లో ఇప్పటికే రూ.1000 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు.
ఫీజు ఎక్కడ చెల్లించాలి? : సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ అధికారి వారి కార్యాలయంలో ఫీజును చెల్లించి ప్రక్రియ పూర్తి చేసుకునే వీలు కల్పించారు. ఇలాంటి ప్లాట్లకు సంబంధించిన వివరాలను సబ్ రిజిస్ట్రార్ నిర్దేశిత ఫార్మాట్‌లో సేకరించి ప్రాసెసింగ్ కోసం ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపనున్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ప్లాట్లు చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్‌తోపాటు నిషేధిత జాబితా, ఇతర ఎలాంటి వివాదంలో లేవని నీటిపారుదల శాఖ(ఇరిగేషన్ డిపార్ట్మెంట్), రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాలి. దీన్నే లెవల్-1 అనుమతుల కింద భావిస్తారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ ఎలా ఇస్తారంటే : ఎల్‌ఆర్‌ఎస్(అక్రమ లేఅవుట్లను ఈ స్కీం) కింద 31.3.2025 లోపు, అంతకుముందు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు సైతం పెండింగ్ మొత్తంలో రాయితీ మినహాయించుకొని మిగతా సొమ్ము చెల్లించే అవకాశాన్ని కల్పించారు.
ఫాం ల్యాండ్స్‌కు వర్తిస్తుందా? : 2020 ఆగస్టు 26 కంటే ముందు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అభివృద్ధి చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వాటినే అక్రమ లేఅవుట్‌గా పరిగణిస్తున్నారు. డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కంకర, బీటీ రోడ్లు లాంటి మౌలిక వసతులు తప్పనిసరి. ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లకు మాత్రమే అవకాశం ఉంది.
మాస్టర్‌ప్లాన్‌లో తప్పులతో ఆగిన వాటి పరిస్థితి ఏమిటి? : మాస్టర్ ప్లాన్‌లో జరిగినటువంటి తప్పులతో క్రమబద్ధీకరణకు నోచుకోని ప్లాట్ల విషయంలో ఇప్పటికే అధికారులు వాటిని సరిచేశారు. ఇంకా ఎక్కడైనా ఉంటే ఆ వివరాలతో అధికారులను సంప్రదిస్తే వాటిపై చర్యలు చేపడతారు.
హెచ్‌ఎండీఏ ఆశలన్నీ ఆ లక్ష ప్లాట్లపైనే - ఎల్ఆర్ఎస్తో రూ.1000 కోట్ల ఆదాయం?
ఎల్‌ఆర్‌ఎస్ లబ్ధిదారులకు బంపర్ ఆఫర్ - ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 25 రాయితీ