Chardham Yatra in Uttarakhand : హిమాలయాల్లోని పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాలకు యాత్ర చేయాలనుకునే భక్తుల కోసం దేశంలోని తొలి 'భారత్ గౌరవ్ ట్రైన్' అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక రైలును టూర్ టైమ్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సహకారంతో టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు.
600 మంది ప్రయాణికుల కోసం : మే 8 నుంచి ప్రారంభమయ్యే ఈ 16 రోజుల ఆధ్యాత్మిక యాత్ర ద్వారా హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించేందుకు అవకాశం కల్పించబడుతుంది. మొత్తం 600 మంది యాత్రికుల కోసం అత్యాధునిక హంగులతో రైలును తీర్చిదిద్దారు. ఇందులో ప్యాంట్రీ, హౌస్‌కీపింగ్, సీసీ కెమెరాలు, భద్రతా సేవలు వంటి సౌకర్యాలు అందించబడతాయి.
"గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ కార్పొరేషన్. మా ఆఫీస్ హైదరాబాద్‌లోని బేగంపేట పర్యాటక భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. ఈసారి చార్‌ధామ్ యాత్ర 2025ని గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టూర్ టైమ్స్, భారత రైల్వేల ద్వారా సంయుక్తంగా నడుపుతున్నాం. చార్‌ధామ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం ట్రైన్‌లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్యర్యంలో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది" -వీరేందర్ సింగ్ రాణా, ఉత్తరాఖండ్ టూరిజం పీఆర్వో
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక సౌకర్యాలు : యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అయ్యంగార్ తెలిపారు. రైలు ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దైవదర్శనాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఆహారం, వసతి, రవాణా సదుపాయాలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటాయని వివరించారు.
మరపురాని అనుభూతిని ఇస్తుంది : ఈ పవిత్ర యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలోని టూర్ టైమ్స్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు, లేదంటే www.tourtimes.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా చార్‌ధామ్ యాత్ర భక్తులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని అయ్యంగార్ తెలిపారు.
టికెట్ల ధరలు : ఈ యాత్రకు ఫస్ట్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.82 వేల 5 వందలు, సెకండ్ ఏసీకి రూ.75 వేల 5 వందలు, థర్డ్ ఏసీకి రూ.70వేల 5 వందలను టికెట్ ధరలుగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
చార్‌ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు - టికెట్ ధర ఎంతో తెలుసా?
సైకిల్‌పై 8ఏళ్ల కూతురితో చార్‌ధామ్ యాత్ర- ఆ వ్యక్తి కోసమే! - Chardham Yatra On Bicycle