Minister Uttam Kumar Reddy on SLBC Tunnel Rescue : ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం సహాయక చర్యలు వేగవంతం అవుతాయన్నారు. ప్రస్తుతం సొరంగంలోకి పెద్ద ఎత్తున వచ్చిన బురదను తొలగించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 33.5 కి.మీ పనులు పూర్తయ్యాయని, మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చిక్కుకుపోయిన ఇద్దరు అమెరికన్లు : సొరంగంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఇంజినీర్లు, నలుగురు జార్ఖండ్ కూలీలు, మరో ఇద్దరు అమెరికాకు చెందిన రాబింగ్ కంపెనీ ఉద్యోగులు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ప్రపంచంలోనే రాబింగ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. వివిధ దేశాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా టన్నెల్స్ తయారు చేసిందన్నారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడతామని స్పష్టం చేశారు.
"ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం దురదృష్టకరం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 8 మంది చిక్కుకున్నారు. ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్‌తో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. సీఎస్ సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో డీవాటరింగ్, డీసిల్టింగ్ పనులు జరుగుతున్నాయి. టన్నెల్ పనులపై బీఆర్ఎస్ అబద్దపు ప్రచారం చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ లీకేజీలు జరిగాయి. గతంలో టన్నెల్‌లో డీవాటరింగ్ పనులకు రూ.29 కోట్లు ఇచ్చారు. శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్ పవర్ స్టేషన్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. పవర్ స్టేషన్‌లో 8 మంది చనిపోతే అక్కడికి వెళ్లిన పాపాన పోలేదు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిని వెళ్లకుండా అరెస్టు చేశారు. ఇవాళ ఘటన జరిగిన 2 గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాం. అవాంతరాలన్నీ అధిగమించి టన్నెల్ నిర్మాణం పూర్తి చేస్తాం" -ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
రంగంలోకి ఈటీఎఫ్ : మరోవైపు సహాయక చర్యల బృందానికి ఆర్మీ సాయం కూడా లభించనుంది. ఇప్పటికే వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలకు తోడు రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ‘ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్ (ETF)’ రంగంలోకి దిగనుంది. నిపుణులైన ఇంజినీర్లతో కూడిన ఈ బృందం వద్ద అత్యాధునిక పరికరాలు, వైద్యసామగ్రి, సాంకేతిక సాధనాలు ఉంటాయి.
అదనంగా మరో బృందం సిద్ధం : స్థానిక యంత్రాంగంతో ఈటీఎఫ్ కమాండర్ సమన్వయం చేసుకుంటున్నట్లు సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అదనంగా ఓ రెస్క్యూ బృందం సహాయక యంత్రాలతో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. సైనిక ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయపనుల్లో నిమగ్నమయ్యాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం - రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, రాత్రికల్లా చేరుకోనున్న ఆర్మీ