Anganwadi Jobs In Telangana : తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీకి మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయం కాగానే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి చేయడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
పదవీ విరమణ చేయనున్న : తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిని పలువురు పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీ విరమణ చేయనున్నందున ఆ పోస్టులనూ నోటిఫికేషన్లలో ప్రభుత్వం పేర్కొంది.
ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి : గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పొందాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది.
టీచర్లుగా పదోన్నతి? : కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50 శాతం సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాసైన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమశాఖ గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి.
మొత్తం ఖాళీలు ఇలా
- ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు : 7,837
- ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులు : 1,918
- పదవీ విరమణ చేయనున్న సిబ్బంది : 3,914
- టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు : 567
- ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులు : 1,918
- భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు : 14,236