Story Of 22 Temples In One Place : ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. ఏ వీధిలో చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. కల్యాణులు, చాళుక్యులు, కాకతీయ రాజుల పాలనాకాలంలో నిర్మించిన పురాతన ఆలయాలు తవ్వకాలలో బయటపడ్డాయి. వాటిని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా గుళ్లు ఉన్న గ్రామాల్లోని విశేషాలపై ప్రత్యేక కథనం.
ఒకే చోట 22 మందిరాలు : దేశానికి స్వాతంత్య్రం సిద్దించక పూర్వం జహీరాబాద్ పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతంలో మాణిక్‌ప్రభు మహేలా (గూడెం), గడిమహేలా కాలనీలు మాత్రమే ఉండేవి. ఈ ప్రదేశంలో ఏవైనా రోగాలు సోకితే ప్రజలంతా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు నాటువైద్యం కూడా చేయించుకునే వారు. ఓ దశలో కలరా, ప్లేగు పంజా విసిరి పలు కుటుంబాల్లో అందరూ మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో మొక్కుల్లో భాగంగా స్థానికులు మాణిక్‌ప్రభు మహేలాలో ఒకే చోట 22 అమ్మవారి ఆలయాలను నిర్మించడం విశేషం. ఏటా దసరా సమయంలో ఇక్కడ వేడుకలను నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో బోనాలను సమర్పిస్తారు.

దైవక్షేత్రాలకు నిలయం : మెదక్ జిల్లాలోని శివ్వంపేట దైవ క్షేత్రాలకు నిలయంగా మారింది. పదుల సంఖ్యలో చారిత్రక కట్టడాలు ఉండటం ఈ ప్రాంతం విశేషం. భవానీశంకర స్వామి, కోదండ రామస్వామి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఉమామహేశ్వర, దుర్గాభవానీ, సంకటమోచన హనుమాన్ ఆలయాలు - 4, శివాలయాలు - 4, కాలభైరవ స్వామి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కాకతీయ రాజుల కాలంలో నిర్మించినవే కావడం విశేషం. ఏ వీధిలో చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. ఇటీవల బగలాముఖి శక్తిపీఠాన్ని స్థాపించారు. శిర్డీ సాయిబాబా, దత్తాత్రేయ మహాస్వామి, ఎల్లమ్మ ఆలయాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.

నాటి శిలాంకోట నేటి అల్లాదుర్గం : ఒకప్పుడు అల్లాదుర్గంను యాదవ, పల్లవ రాజులు పరిపాలించేవారు. అప్పట్లో శిలల తయారీకి ప్రసిద్ధి చెందడంతో ఈ ప్రాంతాన్ని శిలాంకోటగా పిలిచేవారు. శిలాంకోట నుంచి వివిధ ప్రాంతాలకు దేవుడి విగ్రహాలను పంపించేవారు. ఆ తర్వాత కాకతీయుల పాలనలో బేతాళస్వామి, వెంకటేశ్వర, వీరభద్రస్వామి, రేణుకా ఎల్లమ్మ, శివాలయం, నంది, గణపతి, 9 హనుమాన్ ఆలయాలు, అమ్మవారి ఆలయాలు ఇక్కడ ఉండటం విశేషం. బౌద్ధుడు, వర్ధమాన మహావీరుడి, తీర్థంకరుల విగ్రహాలూ ఉన్నాయి. పురాతన శిలాశాసనాలు ఇక్కడ ఎన్నో లభించాయి. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా పురతన కాలంనాటి శిల్పాలు బయటపడుతున్నాయి.

కాకతీయుల కాలంలో నిర్మించినవి : వెల్దుర్తి పురాతన, కొత్తగా నిర్మించిన ఆలయాలతో వర్ధిల్లుతోంది. ఈ ప్రాంతంలో మొత్తం 20కి పైగా క్షేత్రాలు ఉండటం విశేషం. వరంగల్‌లో కాకతీయులు నిర్మించిన సింహద్వారం తరహాలోనే ఇక్కడ విజయస్తూపం, సింహద్వారం, దీప స్తంభాలు కనిపిస్తాయి. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన విఠలేశ్వరాలయం, లక్ష్మమ్మ, దేవత చెరువు వద్ద గోనే మైసమ్మ, రాజరాజేశ్వరిదేవి తదితర ఆలయాలు ప్రధానమైనవి. 4 హనుమాన్ ఆలయాలు సైతం ఉండటం గమనార్హం. రోజూ ఆయా చోట్ల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

11వ శతాబ్ధపు అద్భుతం ఈ ఆలయం - ఇక్కడ అన్నీ వింతలూ, విశేషాలే?
ఏడాదికి రూ.18 కోట్లకు పైగా ఆదాయం - సాంకేతికతకు మాత్రం ఆమడ దూరం