OpenAI Launches AI Agent: ప్రస్తుతం ఎటు చూసినా ఏఐ ట్రెండ్ కన్పిస్తుంది. రోజుకో కొత్త టూల్స్ పుట్టుకొస్తున్నాయి. చైనా ఏఐ డీప్‌సీక్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో పోటీ మరింత పెరిగిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవలే ఓపెన్‌ఏఐ 'డీప్ రీసెర్చ్' పేరుతో చాట్‌జీపీటీలో ఇటీవలే ఒక కొత్త ఫీచర్‌ను జోడించింది. తాజాగా కంపెనీ మరో కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది.
మనుషులకు వర్చువల్ సహోద్యుగులుగా మారి వినియోగదారుల కోసం వెబ్‌లో వివిధ రకాల పనులను చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మీ ఆన్‌లైన్ పనిని వేగంగా, సరళంగా పూర్తిచేస్తుంది. కంపెనీ ఈ 'ఏఐ ఏజెంట్' సేవల్ని భారత్ సహా కెనడా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.
యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా పనులు నిర్వహించే సామర్థ్యంతో ఈ 'ఏఐ ఏజెంట్' పనిచేస్తుంది. అంటే ఈ ఏఐ ఏజెంట్ ఆపరేటర్ మానవుల మాదిరిగానే ఫారమ్‌లను నింపడం నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ సర్వీసుల వరకు అన్ని పనులను చేయగలదని ఓపెన్‌ఏఐ చెబుతోంది. ఈ సేవలు ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. అయితే అమెరికాలో చాట్‌జీపీటీ ప్రో యూజర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది.
తాజాగా కంపెనీ భారత్ సహా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకేలోనూ సేవల్ని యాక్సెస్ చేసే సదుపాయం కల్పించింది. అయితే ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకురాలేదని త్వరలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. అయితే దీనిని వినియోగించేందుకు చాట్‌జీపీటీ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కాంప్లికేటెడ్ ఆన్‌లైన్ టాస్క్‌లు ఆటోమెటిక్‌గా నిర్వహించగలిగే సామర్థ్యంతో ఈ ఏఐ మోడల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఆపరేటర్ కంప్యూటర్- యూజింగ్ ఏజెంట్ (CUA) ఆధారంగా ఈ 'ఏఐ ఏజెంట్' టాస్క్‌లు నిర్వర్తిస్తుంది. ఇది జీపీటీ- 4o, o3 మోడల్‌లోని అధునాతన నైపుణ్యాలు కలిగి ఉంటుంది. ఓ ప్రత్యేక బ్రౌజర్‌లో ఈ ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే?: ఈ ఏఐ ఏజెంట్ సహాయంతో మీరు కమాండ్ ద్వారా పలు రకాల పనులను పూర్తి చేసుకోవచ్చు. యూజర్లు ఇతర కార్యకలాపాలపై దృష్టిసారించేటప్పుడు స్వతంత్రంగా పనులు నిర్వర్తించగల సామర్థ్యం ఉండటం విశేషం. టెక్ట్స్, ఇమేజ్ తరహా ఇన్‌పుట్‌లను స్వీకరిస్తుంది. లోపాల్ని పరిష్కరించడం, ఊహించని సవాళ్లకు అనుగుణంగా పనులు నిర్వహించడం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ ఏజెంట్ సాయం చేస్తుంది.
ఇది కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ (CUA) మోడల్‌ను ఉపయోగించి పనులను నిర్వహిస్తుంది. అందుకోసం ఏ రకమైన ఫారం పూరించాలి, బుకింగ్ సేవలు, ఆన్‌లైన్ ఆర్డర్ వంటి పనులను ఆటోమేటిక్‌గా చేయగలదు. దీనిని ఉపయోగించడానికి వినియోగదారులు వెబ్‌పేజీని సందర్శించాలి. ఇది ప్రత్యేక బ్రౌజర్ విండోలో మాత్రమే పనిచేస్తుంది. దీనిని వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు నియంత్రించుకోవచ్చు.
ఎలాంటి పనులు చేస్తుంది?: ఈ ఏఐ ఏజెంట్ GPT 4o అడ్వాన్స్డ్ టూల్స్‌తో వెబ్‌సైట్‌లను స్కాన్ చేస్తుంది. ఈ మేరకు బ్రౌజర్ ద్వారా పనిచేస్తూ, వెబ్ పేజీలను క్లిక్ చేస్తుంది. ఇది టైప్ చేయడంతో పాటు స్క్రోల్ కూడా చేయగలదు. పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం, చెల్లింపు చేయడం లేదా ఇతర సున్నితమైన సమాచారం అవసరమైతే, ఇది మీ నియంత్రణకు అప్పగిస్తుంది.
డేటా భద్రత విషయంలో ఓపెన్‌ఏఐ అత్యంత జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ 'ఏఐ ఏజెంట్' ఎలాంటి ఆర్థిక లావాదేవీలను ఆటోమేటిక్‌గా నిర్వహించదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందుకోసం వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను నియంత్రించడానికి, బ్రౌజింగ్ డేటాను తొలగించడానికి, డేటా సేకరణను నిలిపివేయడానికి ఆప్షన్లను కలిగి ఉంటారని తెలిపింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కో-వర్కర్లుగా ఏఐ ఏజెంట్లు: ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసే పనిని ఈ 'ఏఐ ఏజెంట్లు' పూర్తి చేయగలవని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. అయితే ఈ ఏజెంట్లు తమకు కేటాయించిన టాస్క్‌ను మాత్రమే పూర్తి చేయగలవని, గొప్ప ఆలోచనలతో ముందుకురాలేవని చెప్పారు. ఈ క్రమంలో మానవ ప్రమేయం అవసరం ఉంటుందని చెప్పారు. దీర్ఘకాలంలో విజ్ఞానానికి సంబంధించిన అన్నిరంగాల్లో ఈ 'ఏఐ ఏజెంట్లు' చొచ్చుకొస్తాయని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
యాపిల్ లవర్స్‌కు క్రేజీ అప్డేట్- ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా ఫోల్డబుల్ ఐఫోన్!
వావ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా?- సెకండ్ వరల్డ్ వార్‌లో ఉపయోగించిన డిజైన్‌తో!
వారెవ్వా! మైక్రోసాఫ్ట్ 'మయోరానా' వేరీ పవర్ఫుల్ బాస్- దశాబ్దాల సమస్యకు కూడా ఇట్టే చెక్!