SLBC Tunnel Rescue Operation : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువగా వచ్చాయి. భారీగా మట్టి, బురద ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. భారత ఆర్మీ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్కూ బృందాలు 8 మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కొనసాగుతున్న ఆపరేషన్ టన్నెల్ : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం 'ఆపరేషన్ టన్నెల్' కొనసాగుతోంది. టన్నెల్‌లో బురద, నీటితో ప్రమాదస్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు 24 మందితో కూడిన ఆర్మీ, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్, 24 మందితో కూడిన హైడ్రా, 24 మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హైకెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది నావికా దళం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది.
ప్రమాదస్థలికి చేరువగా సహాయక బృందాలు : సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాదస్థలికి చేరువగా వెళ్లాయి. ఘటన జరిగిన ప్రాంతానికి 50మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్‌కు 100మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్కబల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉద్ధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి రావటంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఇందులోనే 8 మంది చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా టన్నెల్‌లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి.
సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు : సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం లోకో ట్రైన్‌లో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సొరంగంలోకి వెళ్లి సహాయకచర్యలను పరిశీలించారు. నీరు, బురద తోడేసే పనులు సాగుతున్నాయని సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నారని జూపల్లి తెలిపారు. సహాయక బృందాలు టన్నెల్ బోర్ మిషన్‌కు చేరువగా వెళ్లాయని వివరించారు. రెస్క్యూ టీమ్‌లు రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదని తెలిపారు. 8మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు.
"సొరంగంలో శిథిలాలు 23 నుంచి 25 అడుగుల మేర ఉన్నాయి. కేవలం నాలుగైదు అడుగుల మేర పైభాగం మిగిలి ఉంది. పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఓ ఆశతో ఉన్నాం. ఘటన జరిగిన తీరు చాలా ఆందోళనకరం. బతికే అవకాశాలు ఆశాజనకంగా లేవు. రెస్క్యూ సిబ్బంది వారి పేర్లను పిలిచినప్పటికీ అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దాదాపు 100 అడుగుల దగ్గరకు సిబ్బంది చేరుకున్నారు. ఏ యంత్రాన్ని లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. సొరంగంలో ఘటన చాలా తీవ్రంగా జరిగింది. లోపలికి వెళ్లిన తర్వాత నాకు ఏమనిపించిందంటే బయటకు వచ్చిన 42 మంది కార్మికులు చాలా అదృష్టవంతులు అని. బయటకు వచ్చిన కార్మికులు ఈదుకుంటూ వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, డిఫెన్స్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. నేవీ బృందాలు వస్తున్నాయి. మేము ఏ తరహా ప్రయతాన్ని వదులుకోవాలని అనుకోవట్లేదు" - జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు - 13.5 కి.మీ వరకు వెళ్లిన రెస్క్యూ టీం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం - 12 కి.మీ వరకే లోపలికి వెళ్లవచ్చు, ఆ తర్వాత కష్టమే!