Hezbollah Leader Hassan Nasrallah Funeral : లెబనాన్‌లోని జరిగిన హెజ్‌బొల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన నస్రల్లా అంత్యక్రియలకు లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఏర్పాట్లు చేశారు. ఆయన మరణించిన దాదాపు ఐదునెలల తర్వాత అంత్యక్రియలు జరిపారు. నస్రల్లా మద్దతుదారులు, ప్రజలు వేలాది మందిగా హాజరై ఆయనకు తుది విడ్కోలు పలికారు. నస్రల్లా బంధువు, హెజ్‌బొల్లా వారసుడిగా భావించిన హషీమ్ సఫీద్దీన్‌కు కూడా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు బీరూట్ గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
గతేడాది సెప్టెంబరులో బీరుట్ దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో దాడిలో సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్‌బొల్లా ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరూట్‌లో నస్రల్లాను, సఫీద్దీన్‌ను దక్షిణ లెబనాన్‌లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్‌లోని స్టేడియానికి తరలించింది. ఇరువురికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్‌లోని స్టేడియం కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు విచ్చేసినట్లు హెజ్‌బొల్లా వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖాలిబఫ్, విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హాజరయ్యారని తెలిపాయి. అంత్యక్రియల సమయంలో బీరూట్ గగనతలంపై తమ యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతుండటంపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ దేశం జోలికొస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటుతున్నట్లు అని చెప్పారు. అంతకుముందు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని ఆయుధ నిల్వల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.