Stomach Pain Reasons for Female: సాధారణంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తుంటుంది. అయితే ఇలా నెలసరి సమయంలోనే కాకుండా.. అప్పుడప్పుడూ కూడా కడుపునొప్పి వస్తుంటుంది. ఇది చిన్న సమస్యే కదా అని చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఈ నొప్పి వివిధ రకాల అనారోగ్యాలకు సూచన కావచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి అది ఎలాంటి ఆరోగ్య సమస్యను సూచిస్తుందో తెలుసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అదెలాంటి నొప్పో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్ కావచ్చు: మూత్రనాళంలో మొదలై పొత్తికడుపు వరకు నొప్పి ఉంటే దాన్ని మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సూచనగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కడుపు నొప్పితో పాటు యూరిన్‌కి వెళ్లేటప్పుడు మంట, నొప్పి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలేనని వివరిస్తున్నారు. కొంతమందిలో మూత్రంతో పాటు రక్తం కూడా పడుతుంటుందని.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ ప్రభావం కిడ్నీల వరకు వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడూ మూత్ర వ్యవస్థలో కణితులు ఏర్పడటం వల్ల కూడా ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి ఇలా మూత్రనాళం నుంచి పొత్తికడుపు వరకు నొప్పి వస్తున్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదని సలహా ఇస్తున్నారు. మూత్రపరీక్ష ద్వారా వైద్యులు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ఉందో, లేదో తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారని పేర్కొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పొత్తికడుపు మధ్యభాగంలో: కొంతమంది మహిళలకు పొత్తికడుపు మధ్య భాగంలో నొప్పి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఇలా వస్తే గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాల్లో ఏదో ఒక దానిలో నొప్పి వస్తున్నట్లు భావించాలని నిపుణులు అంటున్నారు. ఇది ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, అండాశయాల్లో సిస్టులు వంటి సమస్యలకు సూచన కావచ్చని వివరిస్తున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గర్భస్రావం జరగడం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (పిండం గర్భాశయం బయట పెరగడం) వంటి క్లిష్టమైన సమస్యలు ఎదురుకావచ్చని అంటున్నారు. కాబట్టి పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించి అసలు సమస్యేంటో నిర్ధరించుకోవాలని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బొడ్డు దగ్గర మొదలైతే: కొన్ని సందర్భాల్లో మహిళలకు కడుపు నొప్పి బొడ్డు దగ్గర మొదలై ఛాతీ వరకు పాకుతుంది. దాంతో పాటు కడుపులో మంటగానూ అనిపిస్తుంటే అది పెప్టిక్ అల్సర్‌కి సూచనగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది రాత్రివేళల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో పాటు ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులవడం, ఛాతీ నొప్పి వంటి ఇతర లక్షణాలూ ఈ సమస్య ఉన్న వారిలో కనిపిస్తాయని తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కడుపుబ్బరంతో పాటు: ఇంకా కడుపుబ్బరంతో పాటు తరచూ కడుపు నొప్పి వేధిస్తుంటే అది ఉదర సంబంధిత క్యాన్సర్లకు సూచన కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

కటిభాగంలో: కొంతమంది మహిళల్లో కటిభాగంలో నొప్పి వస్తుంటుంది. అయితే, అక్కడ నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరు నెలలకు మించి ఈ నొప్పిని భరిస్తున్నట్లయితే దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్‌కి సూచనగా భావించాలని అంటున్నారు. దీనికి సత్వరమే చికిత్స తీసుకోవడం మంచిదని.. కాబట్టి నొప్పి తీవ్రస్థాయికి చేరుకోకముందే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ పేషెంట్లు ఈ 6 పండ్లను అసలు తినకూడదట! అవేంటో మీకు తెలుసా?
చిన్న బెల్లంముక్కతో ఎన్నో సమస్యలు దూరం- వీటితో కలిపి తింటే సూపర్ బెనిఫిట్స్!