Best Sleeping Position: మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం ఉంటుంది. ఈ నిద్ర విషయంలోనే చాలా మందికి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా బోర్లా పడుకోవాలా, వెల్లకిల్లా పడుకోవాలా? లేదంటే ఎడమ, కుడి ఈ రెండింట్లో ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిది? అన్న సందేహాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలా పడుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ రెండూ కాకుండా ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో మెదడు సంబధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని వెల్లడిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మంచిందని అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యకరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మన శరీరంలో జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా, మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు.. మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన శికంలోకి చేరతాయట. ఇది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆ తర్వాత ఇవి క్రమంగా శరీరానికి ఎడమ వైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వస్తాయని అంటున్నారు. అయితే, ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కుడి నుంచి ఎడమ వైపు వ్యర్థాలన్నీ సులభంగా కిందకు వెళ్లిపోతాయని వెల్లడిస్తున్నారు. ఫలితంగా ఉదయాన్నే వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడూ పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల పేగుల ఆరోగ్య మెరుగుపడుతుందని తెలిపారు. ఇదీ పొట్ట ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.


రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనకు గుండె ఎడమ వైపునకు ఉంటుందని.. అదే దిశలో పడుకుంటే గురుత్వాకర్షణ కారణంగా రక్తం సరఫరా బాగా అవుతుందని తెలిపారు. ఫలితంగా గుండెపై ఒత్తిడి తగ్గి.. ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణి దశలో ఎడమ వైపు తిరిగి పడుకోవడం మేలని సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నుముకపై ఒత్తిడి తగ్గి.. నిద్ర చక్కగా పడుతుందని అంటున్నారు. ఇంకా గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగు అవుతుందని పేర్కొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఒక్కోసారి మనకు తెలియకుండానే అతిగా తినేసి.. ఆ తర్వాత ఆయాస పడుతుంటాం. అయితే, ఇలాంటప్పుడు ఓ పది నిమిషాలు ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా మారి.. గురక సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేమని అంటున్నారు. అందుకే కాసేపు కుడి వైపు, వెల్లకిలా పడుకున్నా.. వీలైనంత ఎక్కువ సమయం ఎడమ వైపునకు పడుకోవాలని సూచిస్తున్నారు. ఇలా అప్పుడప్పుడూ అన్ని రకాల భంగిమల్లో పడుకోవడం వల్ల శారీరక నొప్పులు రాకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.


NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలస్నానం చేయగానే టవల్‌తో తుడుస్తున్నారా? తడి జుట్టును దువ్వితే ఏం జరుగుతుందో తెలుసా?