Breastfeeding Mistakes Leads to Child Death : శిశువులకు పాలు పట్టడంలో చాలా మంది తల్లులు తెలియని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో చిన్నారులు అనారోగ్య పాలుకావడం చూస్తుంటాం. మొదటి కాన్పు అయిన తల్లులు అనుభవం లేక, తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. ఏ వయసులో ఉన్న పిల్లలకు ఎంత పరిమాణంలో పాలు పట్టాలి, పోషకాహారం ఇవ్వాలన్న విషయం సరిగ్గా తెలియదు. ప్రస్తుతం ఏక కుటుంబ వ్యవస్థ వల్ల పిల్లల పోషణ అస్తవ్యస్తంగా ఉంటోంది.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్, లాస్యశ్రీ దంపతుల నాలుగు నెలల కవలలు (అమ్మాయి, అబ్బాయి) ఈ నెల 22న ఉదయం డబ్బా పాలు పట్టించి నిద్రపుచ్చగా వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పిల్లలకు పాలు పట్టించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంజీఎం ఆసుపత్రి పిల్లల వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.రవికుమార్‌తో ఈటీవీ భారత్ మాట్లాడింది. పిల్లలకు పాలు పట్టడంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆయన తెలిపారు. ఏ విధంగా పాలు పట్టాలో సలహాలు, సూచనలు ఇచ్చారు.
- ఎప్పుడైనా తల్లి పడుకొని పాలు పట్టకూడదు. అలా పట్టినా, వెంటనే నిద్ర పుచ్చకూడదు. దీనివల్ల పిల్లలు తాగిన పాలు కిందకు జారకుండా ముక్కులోకి వచ్చి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలా అయితే ప్రాణాల మీదకు వస్తుంది. పెద్ద వాళ్లయితే పొరబడితే దగ్గుతారు. చిన్నపిల్లలు అలా చేయలేరు. ఏడుస్తుంటారు. అది ప్రమాదానికి దారితీస్తుంది. ప్రాణాలు కోల్పోయే అవకాశముంటుంది.
- తల్లి నేలపై కూర్చొని లేదా కూర్చీలో ఉండి పాలివ్వడం మంచిది. ఒడిలో బిడ్డను కూర్చొబెట్టుకొని పాలు పట్టినట్లయితే సులువుగా కిందకు జారుతాయి. పాలు పట్టిన వెంటనే నిద్రపుచ్చకుండా కనీసం 10-15 నిమిషాలు చేతిలోకి తీసుకొని భుజాన వేసుకోవాలి. చేతితో తల, వీపుపై జోకొడుతూ లాలిస్తుండాలి. ఈ క్రమంలోనే పిల్లలు నిద్రపోతారు. అప్పుడు వారిని తొట్టెలో లేదా మంచంలో పడుకోబెట్టాలి. ఈ విధంగా చేస్తే పాలు బాగా జీర్ణమవుతాయి.
- డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి పాలైతే పిల్లలు తమకు కావాల్సినన్ని తాగుతారు. కడుపు నిండితే వద్దని మారాం చేస్తారు. అదే సీసాలో పోసి ఇవ్వడం వల్ల దానికి ఉన్న ప్లాస్టిక్ బొడిపెను నోట్లో పెట్టినప్పుడు లాగినన్ని కాకుండా ఎక్కువ వస్తాయి. చిన్నారులు ముందు తాగినవి లోపలకు పూర్తిగా వెళ్లకముందే మరిన్ని పాలు రావడం వల్ల ఊపిరాడదు. ఆయాస పడుతుంటారు. అలాంటప్పుడు తల్లులు గుర్తించకపోతే ఇబ్బందే.
- అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. తప్పనిసరి అయితే పాలు వేడి చేసి, చల్లార్చి గోరువెచ్చనివి ఇవ్వాలి. అది కూడా సీసాలో పోసి మొదటి బుక్కకు రెండో బుక్కకు మధ్య సమయం తీసుకొని పాలు పట్టాలి. సీసాలో పోసి పట్టడానికి బదులుగా స్పూన్‌తో కొద్దికొద్దిగా తాగించాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వరాదు.
- నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లిలో కలకలం సృష్టించిన కవలలు(అబ్బాయి, అమ్మాయి) మృతిలో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. శనివారం రాత్రి భూపాలపల్లి జనరల్ ఆసుపత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం చేశారు. పిల్లల ఊపిరితిత్తుల్లోకి పాలు చేరినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో శ్వాస ఆడక మరణించినట్లు భావిస్తున్నారు.
పది రోజుల్లో నివేదిక : పాలు పట్టించిన వెంటనే పడుకోబెట్టడంతో ఊపిరితిత్తుల్లోకి పాలుచేరి శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడే ప్రమాదముంది. వీరి విషయంలోనూ అలాగే జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పాలు తాగించి త్వరగా పడుకోబెడితే ఎవరో ఒక్కరు చనిపోవాలి. కానీ, ఇద్దరు పిల్లలు నిద్రలోనే ప్రాణాలు వదలడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పాలు కలుషితమయ్యాయా? పాల పొడి కారణమా? అనేది నిర్ధారించడానికీ పోలీసులు పరీక్షలకు పంపించారు. పోస్టుమార్టంలో సేకరించిన పిల్లల అవయవాల్లోని కొన్నింటిని పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలిసింది. ఆ నివేదికలు రావడానికి సుమారు 10 రోజుల సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
పాలపొడి కారణంగా చనిపోయారంటూ ఆరోపణలు : పిల్లల తల్లి లాస్యశ్రీ మాత్రం పాల పొడి కల్తీ కారణంగానే తన పిల్లలు చనిపోయారని ఆరోపిస్తున్నారు. పిల్లలు పుట్టిన వారం రోజుల నుంచి ఒకే కంపెనీకి చెందిన పాల పొడి డబ్బానే వినియోగిస్తున్నాను. ఇప్పటివరకు రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మెడికల్ షాప్‌లో అదే కంపెనీకి చెందిన పాల డబ్బాలు వారం వ్యవధిలో నలుగురైదుగురికి విక్రయించామని, ఆ పిల్లలెవరికీ ఏం కాలేదని మెడికల్ షాపు నిర్వాహకుడు అంటున్నారు. ఎస్‌ఐ అశోక్‌ను అడగ్గా పిల్లల అవయవాల నమూనాలు, పాల పొడిని పరీక్షల నిమిత్తం పంపించామని, నివేదికలు వచ్చాకే అసలు విషయం తెలుస్తుందని తెలిపారు.
బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే - రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలట!