Protein Rich Foods for Energy During Exams : కొన్ని రోజుల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు మంచి మార్కుల కోసం ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టారు. కానీ పరీక్షల ముందు ఏం చదవాలో, ఎలా చదవాలో తెలియక కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. త్వరగా అలసిపోతారు. ముందుగా మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలని, ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్‌ఛార్జి డైటీషియన్ డాక్టర్ విజయలక్ష్మి సూచిస్తున్నారు. నిర్దిష్ట ఆహారం తీసుకుంటూ, సరైన వేళల్లో నిద్ర పోవాలంటున్నారు.
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
భోజనం మితంగా తినాలి : విద్యార్థులు సరైన సమయానికి భోజనం తినాలి. ఉదయం తొందరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం సంప్రదాయ భోజనం మితంగా తినాలి. మాంసాహారం, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాల జోలికి వెళ్లొద్దు. రాత్రి సైతం ఇదే విధంగా నిద్రపోవటానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే దినమంతా చురుగ్గా ఉండొచ్చు.
పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి : సమతుల ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. భోజనంలో పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు పప్పు ధాన్యాలు, చపాతీ, అన్నం, కూరగాయలు లాంటి ఆహారం తినాలి. నూనె పదార్థాలు తక్కువ తీసుకోవాలి. కాలానుగుణ పండ్లు తీసుకోవాలి. వీటి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అతిగా భోజనం చేస్తే ఆరోగ్యం పాడై పరీక్షలపై ప్రభావం పడుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. అల్పాహారంలోనూ తేలిక పాటి ఆహారం తీసుకోవాలి. రోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.
నిద్ర సరిగా పట్టాలంటే ఇవి తినాలి : అతిగా భోజనం చేస్తే నిద్ర సరిగా పట్టదు. ఈ సమయంలో వేపుళ్లు, చిప్స్, తీపి పదార్థాలు, చాక్లెట్లు అస్సలు తినకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటి వల్ల నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తిన్న వెంటనే పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం పది నిమిషాలు నడవాలి. ప్రతి రోజు ఒకే నిర్ణీత సమయంలో నిద్రపోవాలి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే పడుకునే ముందు తీసుకున్న ఆహారం సైతం సక్రమంగా జీర్ణమై ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు.
పరీక్ష రోజు తినాల్సిన భోజనం : ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం అన్నం/ రొట్టె, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, సాంబారు తీసుకోవాలి. రాత్రి అన్నం/చపాతీ, పప్పు లాంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం లేకుండా ఉంటుంది.
త్వరగా అలసిపోతున్నారా? ఇవి తింటే ఫుల్ ఎనర్జీతో ఉంటారట! అవేంటో తెలుసా?
'ఇవి తింటే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది'- బెస్ట్ రిజల్స్ కోసం ఎప్పుడు తినాలి?