IMD Officer On Telangana Weather Report : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, మహాబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణాన్ని మించి రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గాలి అనిశ్చితి వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గాలి అనిశ్చితి కారణంగా ఒకరోజు ఉత్తర తెలంగాణలో, మరోరోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. ఈ మేరకు తెలంగాణ వాతావరణ పరిస్థితిపై ఆయన వివరాలను వెల్లడించారు.
గాలిలోని తేమ పెరగడమే ఉక్కపోతకు కారణం : వేసవి కాలంలో వడగాలులు ఎలా ఉంటాయనే వివరాలకు సంబంధించిన అంచనాల రిపోర్టును ఫిబ్రవరి నెలఖరున ఐఎండీ విడుదల చేస్తుందని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గాలిలోకి తేమ ప్రవేశించడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అనుభూతి ఉంటుందని, ఫలితంగా శరీరానికి మంట కలిగినట్లుగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉత్తర, ఆగ్నేయ దిశనుంచి గాలులు వచ్చినప్పుడు గాలిలోకి తేమ ప్రవేశించి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లుగా ఫీల్ ఉంటుందని వాతావరణ అధికారి తెలిపారు. రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. గాలిలోని అనిశ్చితి కారణంగానే భిన్నవాతావరణం కనిపిస్తోందని వివరించారు.
"గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంచెం నెమ్మదించాయి. గత వారంతో పోల్చితే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత 33 నుంచి 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. రాగల రెండు, మూడు రోజుల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. గాలి అనిశ్చితి వల్ల ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి" -శ్రీనివాసరావు, వాతావరణ కేంద్ర అధికారి
ఒక వారం చలి, మరో వారం వేడి - వచ్చేనెలలో రాష్ట్రంలో మారనున్న వాతావరణం
తెలంగాణకు రెయిన్ అలర్ట్ - 'రాగల మూడు రోజుల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం'