LIC Smart Pension Plan Details: నేటి రోజుల్లో ఆర్థిక స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా డబ్బు సంపాదించేందుకు వీలుగా "స్మార్ట్ పెన్షన్ ప్లాన్" పేరిట కొత్త యాన్యుటీ ప్లాన్ తీసుకొచ్చింది. సింగిల్ ప్రీమియంతో జీవితాంతం పెన్షన్ పొందొచ్చన్నమాట. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ - నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, వ్యక్తిగత/గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్ (ప్లాన్ 879). సంవత్సరం, 6 నెలలు, 3నెలలు, నెలవారీ యాన్యుటీ చెల్లింపులు పొందొచ్చు. కొన్ని షరతులకు లోబడి కొంత మొత్తం లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. ఈ ప్లాన్ ద్వారా లోన్ కూడా పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) సబ్‌స్క్రైబర్లు తక్షణ యాన్యుటీ పొందే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.
పెన్షన్ ప్లాన్ అర్హతలు:
- 18 నుంచి 100 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఎంపికలను బట్టి అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత, దానిని మళ్లీ మార్చలేము. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి.
- ఈ పెన్షన్ ప్లాన్‌కు మార్కెట్‌తో సంబంధం లేదు. అంటే మార్కెట్లు లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుంది.
- ఇందులో సింగిల్ లైఫ్‌తోపాటు జాయింట్ లైఫ్ కవర్ కూడా ఉంది. అంటే జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక భద్రత అందించొచ్చు.
- నెలకు రూ.1000, మూడు నెలలకు రూ.3వేలు, ఏడాదికి రూ.12వేలు చొప్పున కనీసం యాన్యుటీ పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి చొప్పున పాలసీదారుడు యాన్యుటీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- కనీసం రూ.1 లక్ష వెచ్చించాల్సి ఉంటుంది. గరిష్ఠ కొనుగోలుపై పరిమితి లేదు.
- ఈ పాలసీ మూడు నెలలు దాటిన తర్వాత లోన్ సదుపాయం కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.
యాన్యుటీ ఆప్షన్లు:
- మీ జీవితం మొత్తం పెన్షన్ పొందే అవకాశం. లేదంటే 5, 10, 15, 20 సంవత్సరాలపాటు ఎంపిక చేసిన కాలానికి ఈ ప్లాన్ ద్వారా గ్యారంటీ పెన్షన్. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 3 లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది.
- జీవితాంతం పెన్షన్, పైగా కట్టిన మొత్తం తిరిగి అందించే సదుపాయం. జాయింట్ లైఫ్ పెన్షన్‌తో భార్యాభర్తలు జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం.
- 50 లేదా 100 శాతం పెన్షన్ భాగస్వామికి వచ్చేలా, అలాగే 75 లేదా 80 ఏళ్ల వయస్సు వచ్చాక మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది.
- ఆన్‌లైన్‌లోనూ ఈ పాలసీని కొనుగోలుకు చేయొచ్చు. మరిన్ని వివరాలకు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్‌ఐసీ ఏజెంట్లను సంప్రదించండి.
- ఇక పాలసీకి సంబంధించిన అధికారిక సేల్స్ బ్రోచర్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
లేడీస్‌కు గుడ్‌న్యూస్- 'LIC బీమా సఖి' అయ్యే ఛాన్స్- ట్రైనింగ్‌లో నెలకు రూ.7వేలు- నో ఏజ్ లిమిట్
మీ జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!