Champions Trophy India Vs Pakistan : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ఇది రెండో విజయం కాగా, పాకిస్థాన్‌కు రెండో ఓటమి.
టాస్ గెలుచుకుని తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా 42.3 ఓవర్లలో వికెట్లు 4 కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (100*; 111 బంతుల్లో 7 ఫోర్లు) బౌండరీ బాది శతకం పూర్తి చేసుకోవడంతో మ్యాచ్‌ను ముగించాడు.
శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. రోహిత్ శర్మ (20; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుల్‌దిష్ షా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌద్ షకీల్ (62 పరుగులు)హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ రిజ్వాన్ (46 పరుగులు) రాణించాడు. చివర్లో కుష్దిల్ షా (38 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు.
భారత్ తాజాగా విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ కావడం విశేషం. అదే సమయంలో వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 287 ఇన్నింగ్స్‌ల్లో (299 మ్యాచ్‌లు) కోహ్లీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. తాజా విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవ్వగా, పాక్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.