How to Make Ulava charu Recipe : వేడి వేడి అన్నంలో కొద్దిగా ఉలవచారు పోసుకుని, పైన మీగడ వేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా అనిపిస్తుంది ఎవరికైనా. అయితే.. ఎంతో రుచిగా ఉండే ఈ చారును ఇంట్లో ప్రిపేర్ చేయడం కొద్దిగా కష్టమే. అందుకే ఎక్కువ మంది మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ ఉలవచారు ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా కాస్త ఓపికగా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవచారు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఉలవచారు రుచికి ఇక తిరుగుండదు. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి ఉలవచారు ఇంట్లో సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉలవలు -కప్పు
- మెంతులు-టీస్పూన్
- జీలకర్ర-అర టేబుల్‌స్పూన్
- నూనె-3 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు-టీస్పూన్
- ఎండుమిర్చి-2
- వెల్లుల్లి తరుగు- 2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు-2
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-1
- చింతపండు-75 గ్రాములు (15 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి)
- ఇంగువ -2 చిటికెలు
- కారం-అర టేబుల్‌స్పూన్
- పసుపు-అర టీస్పూన్
- నీళ్లు -2 లీటర్లు
- బెల్లం-30 గ్రాములు
తాలింపు కోసం..
- నూనె-2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు-అరటీస్పూన్
- ఎండుమిర్చి-1
- కరివేపాకు-2
తయారీ విధానం :
- ముందుగా ఉలవలను రాళ్లు లేకుండా చెక్ చేయాలి. సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చినా రాళ్లుండే అవకాశం ఉంది.
- ఆ తర్వాత శుభ్రంగా ఎనిమిది సార్లు కడగండి.
- ఆపై ఒక గిన్నెలో 2 లీటర్ల నీరు పోసి దాదాపు 16 గంటలు నానబెట్టుకోవాలి. (ఇంత సమయం నీటిలో నానబెట్టుకోవడం వల్ల మృదువుగా అవుతాయి.)
- ఇప్పుడు ఉలవలను నీటితో పాటు కుక్కర్లోకి తీసుకోండి.
- లో ఫ్లేమ్‌లో 20 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే ఉలవల్లోని సారమంతా చారులోకి దిగుతుంది.
- అనంతరం ఉడికించిన ఉలవలను గిన్నెలోకి వడకట్టుకోండి. ఆ చారుని పక్కన ఉంచుకోండి.
- ఇప్పుడు ఉడికించిన ఉలవలలో అరకప్పు తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టి మెంతులు, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని పొడి చేసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసుకుని వేడి చేసుకోండి. ఆపై ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి వేపండి.
- వెల్లుల్లి వేగిన తర్వాత ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ రంగు మారే వరకు వేపండి.
- ఇప్పుడు చిక్కటి చింతపండు రసం ఇందులో పోసుకోండి.
- ఆయిల్ పైకి తేలె వరకు కలుపుతూ ఉడకనివ్వండి. పులుసు మరిగిన తర్వాత కారం, పసుపు వేసి వేపండి.
- వేగిన కారంలో ఉలవకట్టు, అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉలవల పేస్ట్ వేసి కలపండి.
- ఉలవచారు ఒక పొంగు రాగానే మెంతులు, జీలకర్ర వేపుకున్న పొడి.. టీస్పూన్ వేసి కలపండి.
- అలాగే బెల్లం వేసి మిక్స్ చేయండి. (బెల్లం ఉలవచారుకి మంచి రుచిని ఇస్తుంది)
- ఇప్పుడు స్టౌ లో-ఫ్లేమ్‌లో ఉంచి చారుని దాదాపు 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్‌లో చారు చిక్కబడుతుంది. ఈ సమయంలోనే చారులో ఉప్పు, కారం అన్ని రుచికి సరిపోయేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
- తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉలవచారుని వడకట్టుకోండి. గరిటెతో మెత్తగా మెదిపితే ఉలవల్లోని సారం మొత్తం చారులోకి దిగుతుంది.
- ఇప్పుడు చివరిగా మరో తాలింపు కోసం స్టౌపై గిన్నె పెట్టండి.
- ఇందులో 2 టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఆవాలు వేసి ఫ్రై చేయండి.
- అలాగే ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు చేసి ఫ్రై చేయండి.
- తాలింపు వేగిన తర్వాత ఉలవచారులో కలుపుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే కమ్మటి ఉలవచారు రెడీ అయిపోతుంది.
ఇవి కూడా చదవండి :
నోటికి కమ్మగా ఉండే "జీలకర్ర రసం" - ఇలా చేసుకుని తిన్నారంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఔట్!
బగారా రైస్‌లోకి బెస్ట్ కాంబినేషన్ - తమిళనాడు స్టైల్ "వంకాయ మసాలా" - టేస్ట్ అదుర్స్!