Counterclockwise Clock : ఎలాంటి పనులు ప్రారంభించాలన్నా ముందుగా చూసుకునేది టైమ్. ఏదైనా పని చేస్తూ మధ్యలో ఇప్పుడు టైం ఎంత అయిందని అడుగుతాం. కొందరైతే నిమిషం నిమిషానికి టైమ్ ఎంతై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్ల ముల్లు ఉంటాయి. అవి ఎప్పుడూ ముందుకు (సవ్య దిశ) తిరుగుతూ ఉంటాయి. అయితే అదే గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్లు ముల్లులు వెనకకు తిరిగితే ఎలా ఉంటుంది. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇక్కడ వెనక్కి తిరిగే గడియారం ఉంది. దీన్ని 'రివర్స్ గడియారం' అంటారు. ఇందులో అంకెలూ అపసవ్య దిశలోనే ఉంటాయి. అలా అయితే మరి టైమ్ ఎలా తెలుస్తుందని మీకు డౌటుగా ఉందా? ఇక్కడే ఓ చిన్న ట్రిక్ ఉంది.
అద్దం ముందు గడియారం ఉంచితే సరి : మాదాపూర్‌లో ఉంటున్న విశ్రాంత ఆర్‌బీఐ అధికారి వేణుగోపాలరావు 15 ఏళ్ల క్రితం ఓసారి విదేశీ పర్యటన నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ అప్పట్లోనే రూ.1000 ఖర్చు చేసి రివర్స్ గోడ గడియారాన్ని కొనుగోలు చేశారట. ఇవి మన దేశంలో దొరకడం అరుదే. కానీ విదేశాల్లో మాత్రం దొరుకుతాయి. ఈ గోడ గడియారాన్ని అద్దం ముందు పెట్టి, ఆ మిర్రర్ ఇమేజ్‌లో చూస్తే మామూలు గడియారం మాదిరే సమయాన్ని సూచిస్తుంది. ఇందులోనూ 24 గంటల సమయాన్ని సూచిస్తూ, మామూలు గడియారానికి సెకను కూడా తేడా లేకుండా చూపిస్తుంది. అయితే ఈ గడియారంలో మాత్రం సమయంతో పాటు మానవ జీవన విధానాన్ని సూచించే చిత్రాలు సైతం ఉన్నాయి.