Telangana Panchayat Election Schedule Before 15th of February Month : ఈ నెల 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన "ఎన్నికలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి" అంటూ కార్యకర్తలకు సూచించారు. వైరా మండలంలో కార్యకర్తలతో పొంగులేటి మాట్లాడారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు : పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్,ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. కులగణన నివేదిక కేబినెట్ సబ్‌కమిటీకి నేడు అందింది.దీనిపై కేబినెట్‌లో చర్చించాక 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలుంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికలు త్వరలోనే - క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి