Effect Of Marital Disputes On Children : చిన్నారులు తప్పటడుగులు వేస్తే తల్లిదండ్రులు సరిచేసి వారికి ఏది సరైన మార్గమో చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో తల్లిదండ్రులే తప్పుడు అడుగులు వేస్తూ చిన్నారులకు జీవితాంతం శిక్ష వేస్తున్నారు. కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధాలు, వివిధ కారణాలతో భర్త భార్యను హతమార్చడం, భార్య భర్తను అంతమొందించడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రులే సర్వస్వం అని నమ్ముకున్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న వివాహేతర సంబంధాలు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చింది. కుట్రకోణం బహిర్గతం కావడంతో చివరకు కటకటాలపాలైంది. తల్లి చేసిన తప్పిదానికి 11 ఏళ్ల కుమార్తె, తొమ్మిదేళ్ల కుమారుడికి తండ్రి లేకుండా పోయిన దయనీయ స్థితి ఏర్పడింది. తల్లి జైలు పాలవ్వడంతో పిల్లలు అనాథలుగా మారారు. చివరకు బంధువుల ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నస్రుల్లాబాద్ మండలంలోని ఓ గ్రామంలో మహిళ సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో తగాదాలు ప్రారంభమయ్యాయి. చివరకు ప్రియుడితో కలిసి భర్తకు మద్యం ఇచ్చి గొంతు నులిమి హతమార్చింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దీంతో అధికారులు బాలికను కస్తూర్బా పాఠశాలలో, బాలుడిని బాలసదనంలో చేర్పించారు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు : గతేడాది నిజామాబాద్ జిల్లాలో 37 హత్య కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 వివాహేతర సంబంధాలవే కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6 హత్య కేసులు నమోదు కాగా, ఇందులో 2 వివాహేతర సంబంధాలవే ఉన్నాయి. ఈ తరహా కేసుల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు హత్యకు గురవ్వడం, మరొకరు జైలు పాలు కావడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అరెస్టయిన వారిని బెయిల్‌పై బయటకు తీసుకువచ్చేందుకు బంధువులు నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాల కారణంగా హత్యకు పాల్పడి జైలుకెళ్లిన వారిని సమాజం దగ్గరకు రానీయని పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి వారి మూలంగా కుటుంబసభ్యులు, పిల్లలు బాహ్య ప్రపంచంలో చులకనకు గురవుతున్నారు. జీవితాంతం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
స్వీయ క్రమశిక్షణ లేకపోవడంతోనే : హత్య కేసుల్లో నిందితులకు వేగంగానే శిక్షలు ఖరారవుతున్నాయి. జిల్లాలో గతేడాది 12 ప్రధాన కేసుల్లో న్యాయస్థానాలు శిక్షలు ఖరారు చేశాయి. పోక్సో, హత్యలు వంటి కేసుల్లో బలమైన సాక్ష్యాలు ఉంటే కోర్టులు వాయిదాలు లేకుండానే శిక్షలు ఖరారు చేస్తున్నాయి. అయినప్పటికీ హత్యల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. స్వీయ క్రమశిక్షణ లేకపోవడంతో పాటు కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా వ్యవహరిస్తుండటమే ఈ తరహా ఘటనలు జరగడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. తాము లేకుంటే పిల్లల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచిస్తే సమస్యలు ఉత్పన్నం కావని మానసిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అన్యోన్య దాంపత్య బంధం - ఆ ఐదింటితో అవుతోంది ఆగమాగం
ఆదుకోండయ్యా : ఏడాదిన్నర క్రితం తండ్రి - ఇటీవల తల్లి మృతి - అనాథలైన ఐదుగురు చిన్నారులు