Husband Missing in Forest and Wife Staying with Five Childrens : కుటుంబాన్ని పోషించే భర్త అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి అదృశ్యం అయ్యాడు. ఐదుగురు పిల్లలతో గృహిణి బతుకు పోరాటం చేస్తోంది. మారుమూల అటవీ ప్రాంతంలో ఐదుగురు పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తున్న మహిళకు చేదోడువాదోడుగా ఉంటున్న అత్త సైతం ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ కుటుంబ ఆలనా పాలనా చూసేవారు కరవయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన మహిళ హృదయ విదారక దీన గాథ ఇది. ఆ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అధికారులు స్పందించడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,
ఎర్రపెంట చెంచు గ్రామానికి చెందిన నిమ్మల శంకర్ అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం తన స్నేహితుడు కృష్ణతో కలిసి గత సంవత్సరం సెప్టెంబరు 28న ఎర్రపెంట దగ్గరలోని అడవిలోకి వెళ్లారు. రాత్రి కావటంతో ఇద్దరూ కలిసి ఆ అడవిలోనే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం చూస్తే నిమ్మల శంకర్ పక్కన లేడు. ఈ విషయాన్ని కృష్ణ బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిమ్మల శంకర్ భార్య లక్ష్మమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అటవీ అధికారులు, పోలీసులు అడవి మొత్తం గాలించారు. ఎంత గాలించినా శంకర్ ఆచూకీ లభించలేదు. దీంతో అటవీ అధికారులు, పోలీసులు చేతులెత్తేశారు.
4 నెలలు కావొస్తున్నా భర్త ఆచూకీ లభించ లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఏం అయ్యాడోనని బెంగతో భార్య లక్ష్మమ్మ ఐదుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అత్త నిమ్మల ఈదమ్మ (56) కుమారుడు లేడని తీవ్రంగా మనస్తాపం చెందారు. నిమ్మల ఈదమ్మ కుమారుడి కోసం ఎదురు చూస్తూ నిద్రాహారాలు మాని అనారోగ్యానికి గురై మంచం పట్టింది. ఈ క్రమంలో 13 రోజుల క్రితం ఆమె సైతం మృతి చెందారు. ఈ కుటుంబానికి కనీసం రేషన్ కార్డు కూడా లేదు. తిండికి గడువని స్థితిలో లక్ష్మమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని అధికారులు పలుకరించిన పాపాన పోలేదు.
'కనీసం చనిపోయాడనైనా చెప్పండి' : కుమారుడి కోసం 12 ఏళ్లుగా ఎదురుచూపులు
తెలంగాణ నుంచి కుంభమేళాకు భక్తులు - తప్పిపోయిన నలుగురు మహిళలు