Illegal Soil Transport in Mahabubnagar : ప్రకృతి వనరులకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పే అధికారుల మాటలు, హెచ్చరికలు కార్యరూపం దాల్చకపోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో యథేచ్ఛగా సహజ వనరుల ధ్వంసం జరుగుతోంది. ఎక్కడ మట్టి దొరికితే అక్కడ గద్దల్లా వాలి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. వాహనాలు పట్టుబడితే అవి మనవాళ్లవే వదిలేయండని బడా నేతలు హెచ్చరిస్తున్నారని జిల్లా కోడై కూస్తోంది.
- జిల్లాలో ఇద్దరు బడా నేతలు మట్టి దందాను కొనసాగిస్తున్న వారికి గాడ్ ఫాదర్లుగా అభయ హస్తం అందిస్తున్నారు. జిల్లాను రెండు ప్రాంతాలుగా విడదీసి, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో దందా కొనసాగిస్తుండటంతో వీరిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
- గట్టు మండలానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తరలిస్తున్నారని చర్చ జరుగుతోంది.
- గద్వాల మండలం నాయకుని కుటుంబ సభ్యులు, మల్దకల్ మండలానికి చెందిన యువ నాయకుడు మట్టి దందాను చేస్తున్న వారిలో కీలకంగా ఉన్నారని సమాచారం. వీరంతా బడా నేతల ముఖ్య అనుచరులుగా గుర్తింపు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోడానికి వెనకాడుతున్నారు.
- వారం కిందట ఇటిక్యాల మండలంలో మట్టి తవ్వకాలు జరుపుతున్న వారికి, బడా నేతకు మధ్య కమీషన్ విషయంలో వివాదం రావడంతో తవ్వకాలను నిలిపి వేయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పట్టపగలే మట్టి తరలింపు : జిల్లా కేంద్రం సమీపంలో గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ, పట్టా భూముల్లో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో టిప్పర్లలో మట్టిని పట్టపగలే తరలిస్తున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అందుబాటులో లేని అధికారి : పెట్టుబడి లేకుండా ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ ప్రతి నెలా రూ.లక్షలు జేబులో వేసుకుంటున్న అక్రమార్కుల నుంచి క్రమం తప్పకుండా కమీషన్లు అందుతుండటంతో దందాపై ఎవరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోంది. మహబూబ్నగర్ జిల్లా మైనింగ్ అధికారి రమణను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.