Crawling Exercise Benefits: కండరాల దృఢంగా ఉండడానికి, కొవ్వు కరిగించుకొని చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వీటి ద్వారా శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుందా? లేదా? అని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? కానీ అలాంటి అనుమానం లేకుండా శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందిస్తుంది క్రాలింగ్! పసిపిల్లల్లా నేలపై పాకుతూ చేసే వ్యాయామాన్నే క్రాలింగ్ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలు దృఢంగా
నేలపై పాకడం ద్వారా కాళ్లు, చేతులు, నడుము ఇలా శరీరంలోని ప్రధాన భాగాలన్నీ కదులుతాయి. ఫలితంగా ఆయా భాగాలకు తగినంత వ్యాయామం అంది.. కండరాలు మరింత దృఢంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెన్నునొప్పి కూడా తగ్గుముఖం పడుతుందని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నీ శరీరం గ్రహించేలా చేయడంలోనూ ఈ వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు. 2018లో Journal of Strength and Conditioning Researchలో ప్రచురితమైన "The Effects of Crawling Exercise on Core Strength and Flexibility in Healthy Adults" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆ సమస్యలకు దూరం
మనలో సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో తరచూ వివిధ రకాల అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజువారీ వ్యాయామంలో భాగంగా కాసేపు పాకడాన్ని కూడా సాధన చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాయామం వల్ల ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలూ తగ్గుముఖం పడతాయని వివరిస్తున్నారు.
తీరైన ఆకృతి కూడా
మనం పాకేటప్పుడు కాళ్లు, చేతులు, నడుము, తొడలు ఇలా ప్రతి భాగానికీ వ్యాయామం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆయా భాగాల వద్ద కండరాల సామర్థ్యం మెరుగుపడడంతో పాటు అవి తీరైన ఆకృతిలో వస్తాయని తెలిపారు. ఫలితంగా ఇటు ఫిట్‌నెస్‌ను, అటు చక్కటి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.
ప్రయోజనాలెన్నో!
- రోజూ క్రాలింగ్ చేయడం ద్వారా ఆటల్లో కూడా బాగా రాణించచ్చని నిపుణులు అంటున్నారు.
- తరచూ ఈ వ్యాయామం చేయడం వల్ల భుజాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అవి దృఢమై బరువు మోసే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
- క్రాలింగ్ ద్వారా శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను కూడా సులభంగా కరిగించుకోవచ్చని సూచిస్తున్నారు.
- రోజువారీ పనుల కారణంగా మనం ఎదుర్కొనే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ వ్యాయామం చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అలాగే మన శరీరంలోని నాడీ వ్యవస్థను కూడా ఇది ప్రభావితం చేసి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు.
ఎలా పాకాలి?
సాధారణంగానే మనకు పాకడం అనగానే నెలల వయసున్న పిల్లలే గుర్తొస్తారు. అయితే ఈ వ్యాయామంలో భాగంగా చిన్న పిల్లల్లాగే కాకుండా వివిధ రకాలుగా పాకుతూ మన ఫిట్‌నెస్‌ను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో శరీరాన్ని పూర్తిగా నేలకు ఆనించి పాకడం, చేతులు-కాళ్లను మాత్రమే నేలకు ఆనించి జంతువుల్లా పాకడం, చేతులు-కాళ్లను నేలకు ఆనించి వాటిపై బరువు మోపుతూ వెల్లకిలా పడుకున్న భంగిమలో నడవడం ఇలా క్రాలింగ్ వ్యాయామాల్లో చాలా రకాలే ఉన్నాయంటున్నారు. ఇలా రోజుకో భంగిమ చొప్పున పది నిమిషాల పాటు చేస్తే చక్కటి ఫలితాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలున్న వారు, గర్భిణులు ఈ తరహా వ్యాయామాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'పిల్లలకు ఫోన్ ఇస్తే మాటలు రావు'- ఆటిజం, ఏడీహెచ్‌డీ వచ్చే ఛాన్స్! మరి ఏం చేయాలి?
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? ఈ టిప్స్ పాటిస్తే సుఖంగా నిద్రపోతారు!