Handwriting Tricks In Exams : పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కష్టపడి చదువుతాం. అలాగే సమాధానాలు రాసేటప్పుడు చేతిరాత రాసే తీరు కూడా బాగుండాలి. లేకుంటే ఎంత చదివినా వ్యర్థమే. మీరు ఏం రాశారో అన్నది సమాధాన పత్రంలో కరెక్షన్ చేసేవారికి అర్థమవ్వాలి. చేతిరాత అందంగా లేకపోతే మార్కులు పడవు. పరీక్షలు ఎలా రాయాలో నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవేంటో చూసేయండి.
పరీక్ష ఎలా రాయాలంట? : పరీక్షలు రాసేముందు రాత్రింబవళ్లు కష్టపడి చదివినవన్నీ గుర్తుండాలంటే ఒక్కసారి రాసి చూసుకోవాలి. ఇలా రాయడం వల్ల చదివినవి గుర్తుకొస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు. అక్షర దోషాలుంటే సరి చేసుకోవచ్చు. దేనికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. ఆ తర్వాత పరీక్ష హాలులో రాయడానికి సులువుగా ఉంటుంది.
చేతిరాత రాసేతీరు : పరీక్ష హాలులో ఇచ్చే సమాధాన పత్రంలో 14 నుంచి 16 వరుసలు రాయవచ్చు. అయితే ఒక్కొక్క లైన్ ఆరు నుంచి ఏడు పదాలు ఉండేలా చూసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ రాస్తే చేతిరాత ఇరికించినట్లుగా కనిపిస్తుంది. అలాగే రాసేటప్పుడు ఎక్కడైనా తప్పులు రాస్తే పదే పదే కొట్టేయకుండా ఆ పదాన్ని అడ్డగీతతో కొట్టేసి తిరిగి పక్క నుంచి రాయాలి. ఎక్కువ తప్పులు రాయకుండా జాగ్రత్తపడాలి. సమాధానం చివర ఫుల్స్టాప్ ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి.
అక్షరాలు అందంగా : వాక్యాలు, వాటిలోని పదాలు గజిబిజిగా లేకుండా స్పష్టంగా రాయాలి. కరెక్షన్ చేసేవారికి అవి అర్థమవ్వాలి. ప్రతి అక్షరానికి ప్రాముఖ్యతనిస్తూ, పదాల మధ్య ఒక అక్షరమంత నిడివిని పాటించాలి. అలాగని అక్షరాలు అందంగా, సృజనాత్మకంగా రాయాలనే ఆలోచనపై మాత్రమే ఉండకుండా సమాధానాలు త్వరగా రాయాలి. ఎన్ని మార్కుల ప్రశ్నకు సమాధానం ఏ మేరకు రాయాలో తెలుసుకుని అంతే రాయాలి. అవసరానికి మించి రాయడం వల్ల సమయం వృథా అవుతుంది.
పెన్ను కూడా చాలా ముఖ్యం : పరీక్ష రాసేటప్పుడు పెన్ను కూడా చాలా ముఖ్యం. మీ చేతిరాతకు ఏ పెన్ను వేగంగా రాయడానికి సాయంగా ఉంటుందో గుర్తించి ఎంపిక చేసుకోవాలి. అలాగే వేళ్ల మధ్య పెన్ను పట్టుకునే గ్రిప్ సరిగ్గా ఉండాలి. రాసేటప్పుడు వేళ్ల మధ్య పెన్‌ను గట్టిగా ఒత్తి పట్టుకోకూడదు. దానిపై మనం చూపించే ఒత్తిడి కాగితంపైన కూడా పడుతుంది. దీంతో వేగంగా రాయడం వీలుకాదు. అలాకాకుండా చేతిలో పెన్ తేలికగా ఉంటేనే, వేగంగా సమాధానాలను రాయవచ్చు.
పదో తరగతి పరీక్షల కీలక అప్‌డేట్ - ప్రీ ఫైనల్‌లో ఓఎంఆర్ షీట్
తెలుగే కదా అని ఈజీగా తీసుకోకండి - అలా అనుకునే ఫెయిల్ అయిపోతున్నారంట!