How to Make Fish Biryani: చేపల వంటకాలు అంటేనే మెజార్టీ జనానికి నోరూరుతుంది. పులుసు, ఫ్రై, పచ్చడి ఏది చేసినా సరే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే. అయితే ఎప్పుడూ చేపలతో పులుసు, ఫ్రై అంటే బోర్‌కొడుతుంది. అలాంటి సమయంలో ఇలా బిర్యానీ చేసుకుంటే అద్దిరిపోతుంది. పైగా దీని కోసం ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. మరి ముక్క చెదరకుండా సూపర్ టేస్టీ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
మ్యారినేషన్ కోసం కావలసిన పదార్థాలు:
- వంజరం చేప ముక్కలు - 1 కిలో
- పసుపు - 1 టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:
- నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
- నూనె - 1 టేబుల్స్పూన్
- బిర్యానీ ఆకులు - 3
- దాల్చిన చెక్క - కొద్దిగా
- లవంగాలు - 4
- యాలకులు - 3
- ఉల్లిపాయలు - 5
- తరిగిన అల్లం - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 8
- పచ్చిమిరపకాయలు - 3
- ఎండుమిరపకాయలు - 3
- తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
- నీళ్లు - సరిపడా
- టమాటాలు - 3
- పసుపు - 1 / 2 టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 2 టీస్పూన్లు
- ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
- కొత్తిమీర - గుప్పెడు
- పుదీనా ఆకులు - గుప్పెడు
- బాస్మతీ బియ్యం - 500 గ్రాములు
- పలచటి కొబ్బరి పాలు - 500 మిల్లీలీటర్లు
తయారీ విధానం:
- ఫిష్‌ను శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
- ఓ బౌల్లోకి చేప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మూత పెట్టి ఓ అరగంటసేపు పక్కన పెట్టాలి.
- ఈలోపు ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి. అలాగే ఉల్లిపాయ, టమాటలను సన్నగా తరగాలి.
- స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె పోసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి.
- మిక్సీజార్ తీసుకుని అందులోకి తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు టమాట ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి బాగా వేగించాలి.
- టమాట ముక్కలు మెత్తగా ఉడికి దగ్గరపడిన తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి నిధానంగా కలపాలి.
- ఓ రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ముక్కలు చెదరకుండా, బియ్యం విరగకుండా నెమ్మదిగా కలపాలి.
- ఆ తర్వాత పల్చని కొబ్బరిపాలను పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయాలి.
- కుక్కర్ నుంచి ఆవిరి వస్తున్నప్పుడు విజిల్ పెట్టి 5 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఓ పావు గంట తర్వాత కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో తింటే సూపర్‌గా ఉంటుంది. మరి నచ్చితే మీరూ చేసుకుని ఈ సండే ఎంజాయ్ చేయండి. అయితే ఇక్కడ మీకు వంజరం చేప ముక్కలు దొరకకపోతే వేరే ఏదైనా చేపతో ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఏ చేపలు తింటే గుండెకు మంచిది? - ఇవి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యమంటున్న నిపుణులు!
ఇదేందయ్యా ఇది - ప్లాస్టిక్ బాటిల్‌తో ఇంత సులువుగా చేపలు పట్టొచ్చా?- ఐడియా అదుర్స్ గురూ!