Tenders For Road works in Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటి పరిష్కారం కోసం సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రహదారుల పనులను మొదలు పెట్టనుంది. ఇందులో అండర్ పాస్‌లు, పైవంతెనలు కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన రూ.7,032 కోట్ల విలువైన 38 పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అందులోని రూ.2,373 కోట్లతో వివిధ పనులకు మొదటి దశ కింద టెండర్లు పిలవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నిర్ణయించారు.
కేబీఆర్ పార్కు చుట్టూ : కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టే ఆరు కూడళ్ల అభివృద్ధికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని తెలిపింది. మిగిలిన ప్రాజెక్టులకు బల్దియా నిధులను వెచ్చిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సమస్య లేనందున పనులన్నింటినీ రెండు నుంచి మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది.
పైవంతెనలు, అండర్ పాస్‌లు : జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు కూడలిలో, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు చౌరస్తాలో, రోడ్డు నం.45 కూడలిలో, ఫిల్మ్‌నగర్ కూడలిలో, మహారాజ అగ్రసేన్ కూడలిలో, క్యాన్సర్ ఆస్పత్రి కూడలిలో పైవంతెనలు, అండర్ పాస్‌లు వస్తాయి.
ట్రాఫిక్ సమస్యకు ఇలా పరిష్కారం
- ఖాజాగూడ చౌరస్తాలో మెహిదీపట్నం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాహనాలు ప్రస్తుతం ఖాజాగూడ చౌరస్తాలో ఆగుతున్నాయి. టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాల కోసం కూడలిలో అండర్‌పాస్, నానక్‌రామ్‌గూడ నుంచి టోలిచౌకి వైపు వెళ్లే వారికి ఓ పైవంతెన నిర్మిస్తారు.
- ట్రిపుల్ ఐటీ కూడలిలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మూడు పైవంతెనలు, ఓ అండర్‌పాస్‌ను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
- విప్రో కూడలిలో ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి ఓఆర్‌ఆర్‌కు నేరుగా వెళ్లేలా విప్రో చౌరస్తాపై ఐఎస్‌బీ రోడ్డు-ఓఆర్‌ఆర్ దిశలో నాలుగు లైన్ల పైవంతెనను, దానికి కొనసాగింపుగా ఐసీఐసీఐ చౌరస్తాలో నాలుగు లైన్ల భూగర్భ మార్గాన్ని నిర్మించాలన్నది ప్రణాళిక.
- చింతల్‌లోని ఫాక్స్‌సాగర్ వరద నాలాపై నాలుగు లైన్ల స్టీలు బ్రిడ్జి నిర్మాణం జరగనుంది.
- సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు 215 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ.
- అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు 150 అడుగుల వెడల్పున రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి.
ఇకపై 20 నిమిషాల్లోనే జూపార్క్ నుంచి ఆరాంఘర్ - అందుబాటులోకి నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్
పాతబస్తీ నుంచి శంషాబాద్‌కు ఇక రయ్రయ్ - భాగ్యనగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం