Fastest Typing With Nose World Record : విభిన్నంగా ఏదైనా చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. దాని కోసం ఎలాంటి కష్టమైన పనులైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వివిధ వ్యూహాలను అనుసరించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చేకునేందుకు ప్రయత్నిస్తారు. దిల్లీకి చెందిన ఓ వ్యక్తి అలాంటి ప్రయత్నమే చేశారు. మొబైల్ కీబోర్డ్‌పై ముక్కుతో ఆంగ్ల వర్ణమాలను వేగంగా టైప్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ అధిగమించారు.
21వసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
దిల్లీలోని కిరాడికి చెందిన వినోద్ కుమార్ చౌదరిని టైపింగ్ మ్యాన్‌గా అందరూ పిలుచుకుంటారు. టైపింగ్‌లో ఈయన ప్రావీణ్యం సంపాదించారు. ఈ క్రమంలో ముక్కుతో మొబైల్ కీబోర్డ్‌పై 108 ఆంగ్ల క్యారెక్టర్లను నిమిషం 18 సెకన్లలో టైప్ చేశారు వినోద్ కుమార్. దీంతో వేగంగా ముక్కుతో టైప్ చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఈ క్రమంలో 21వ సారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించుకున్నారు.
సచిన్ రికార్డు బ్రేక్
గిన్నీస్ రికార్డుల సంఖ్యలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను వినోద్ కుమార్ చౌదరి దాటేశారు. టైపింగ్‌లో వినోద్ ఏకంగా 21 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను దాటేశారు.
నా విజయ రహస్యం అదే : వినోద్ కుమార్
"నా విజయ రహస్యం ప్రతిరోజూ ధ్యానం చేయడం, ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడమే. టైపింగ్ నా వృత్తి మాత్రమే కాదు. నా అభిరుచి కూడా. అందుకే నా అభిరుచిని, జీవనోపాధిని కలిపి టైపింగ్ విభాగంలో రికార్డు సృష్టించాలని అనుకున్నాను. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, మీ అభిరుచిని వదులుకోవద్దు."
--వినోద్ చౌదరి
తొలి రికార్డు 2014లో
ముక్కుతో వేగంగా టైపింగ్ చేయడం, కళ్లకు గంతలు కట్టుకుని టైప్ చేయడం, మౌత్ స్టిక్‌తో టైప్ చేయడంలో వినోద్ చౌదరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. వినోద్ చౌదరి 2014లో తొలిసారి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈ 11 ఏళ్లలో 21 సార్లు గిన్నీస్ రికార్డును సృష్టించారు. తన పేరిట ఉన్న రికార్డులు చాలాసార్లు తానే బద్దలుకొట్టారు.