Delhi New BJP CM Rekha Gupta : దిల్లీ కొత్త సీఎం ఎవరనే అంశంపై కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ రేఖా గుప్తా వైపే భాజపా అధిష్ఠానం మొగ్గు చూపింది. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు దిల్లీ సీఎం పగ్గాలు అప్పగించడం విశేషం.
రేఖా గుప్తాను పార్టీ శాసనసభాపక్ష నేతగా దిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు దిల్లీ బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నికైనందుకు రేఖా గుప్తాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గురువారం మధ్యాహ్నం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అంతకుముందు దిల్లీ ఎల్జీ వీకే సక్సేనాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
श्रीमती रेखा गुप्ता जी को दिल्ली भाजपा विधायक दल का नेता चुने जाने पर हार्दिक बधाई एवं अशेष शुभकामनाएँ।
— BJP Delhi (@BJP4Delhi) February 19, 2025
हमें पूर्ण विश्वास है कि आपके नेतृत्व में प्रदेश उत्तरोत्तर प्रगति करेगा। pic.twitter.com/K8Mu5SyvdV
#WATCH | BJP MLA Rekha Gupta meets Delhi LG Vinai Kumar Saxena, stakes claim to form govt after being named as leader of Delhi BJP legislative party
— ANI (@ANI) February 19, 2025
She will take oath as Chief Minister of Delhi tomorrow, 20th February. pic.twitter.com/0jNVMkQYVi
నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అధిష్ఠాన పరిశీలకులుగా విశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం రేఖా గుప్తా పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపారు. నూతన ముఖ్యమంత్రికి పార్టీ అధిష్ఠానం శుభాకాంక్షలు తెలిపింది.
ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు
దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గురువారం రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు ప్రమాణస్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలతో పాటు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.
ఈనెల 8న వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా నూతన ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటిదాకా తెలియరాలేదు. దిల్లీ కొత్త సీఎంగా రేఖను ప్రకటించే ముందు మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఈయన తాజా ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. కానీ రేఖ వైపే బీజేపీ మొగ్గు చూపించింది.
బీజేపీ బంపర్ విక్టరీ
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఏకంగా 48 స్థానాల్లో విజయదుందుభి మోగించి, 27 ఏళ్ల తర్వాత తిరిగి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసారి ఏకంగా 40సీట్లు కోల్పోయి 22కే పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా లాంటి నేతలు ఓటమి పాలయ్యారు.