How to Use Leftover Curd: మనలో చాలా మంది కూరల్లాగే మిగిలిపోయిన పెరుగును మరుసటి రోజు తినడానికి ఇష్టపడరు. పుల్లగా మారిపోయిందని బయటపడేస్తుంటారు. అయితే, అలాంటప్పుడు పెరుగును పడేయడం కాకుండా.. కొన్ని వంటకాల తయారీలో వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫలితంగా వంటకాల రుచి పెరగడంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్‌లో పండ్లు, తేనె, కొన్ని ఐస్‌ముక్కలతో పాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుందట.
- మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడుకుతాయట. అలాగే కూర రుచి కూడా పెరుగుతుందని అంటున్నారు.
- సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుందని తెలిపారు. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.
- చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్‌లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయని తెలిపారు.
- అంతేకాకుండా పెరుగుతోనూ రుచికరమైన డిప్ తయారుచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్‌లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందని అంటున్నారు.
- ఇంకా మిగిలిపోయిన పెరుగుతో రైతా, మజ్జిగ చారు వంటివి తయారుచేసుకోవచ్చు. అలాగే ఈ పెరుగుకు నీళ్లు, చక్కెర, రోజ్‌వాటర్ వంటి పదార్థాల్ని కలుపుకొని రుచికరమైన లస్సీ కూడా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
- కేక్స్, మఫిన్స్, ప్యాన్‌కేక్స్ వంటి బేకింగ్ వంటకాల్లో పెరుగు లేదంటే దాన్నే కాస్త చిలికి క్రీమీగా మారాక ఉపయోగించచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బేక్ చేశాక అవి మరింత మృదువుగా మారి.. వాటి రుచీ ఇనుమడిస్తుందని అంటున్నారు.
- క్రీమీగా చిలికిన పెరుగును చిక్కీలు, గ్రానోలా బార్స్‌పై తీగలా గార్నిష్ చేసి తీసుకుంటే తియ్యతియ్యగా, పుల్లపుల్లగా రుచి భలే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా ఉంటుందట!
- ఇంకా దీనితో ఐస్‌క్రీమ్ కూడా చేసుకోవచ్చట! ఇందుకోసం మిగిలిపోయిన పెరుగు, పండ్ల ముక్కలు, కాస్త తేనెను ఈ మూడింటినీ పాప్సికల్ మోల్డ్స్‌లో వేసి కొన్ని గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫలితంగా ఐస్‌క్రీమ్ తయారవుతుందని అంటున్నారు. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికీ మంచిదని సూచిస్తున్నారు. పిల్లలకు ఈ ఐస్‌క్రీమ్ ఇస్తే ఎంతో ఇష్టంగా లాగించేస్తారని చెబుతున్నారు.
- కొన్ని రకాల మసాలా వంటకాల్లో పెరుగు ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో పాటు టీస్పూన్ వెనిగర్, కాస్త నిమ్మరసం కూడా కలిపితే కూరకు అదనపు రుచిని జోడించచ్చని అంటున్నారు.
రిజైన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఇలా చేస్తే మంచిది కాదని నిపుణుల సూచన
పిల్లలు మట్టి, బలపం తింటున్నారా? ఏం చేస్తే ఈ అలవాటు మానేస్తారు? అసలెందుకు ఇలా తింటారు?