Trump On Taxes : త్వరలోనే భారత్‌తోపాటు చైనాపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ రెండు దేశాలు అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
'ఇండియా, చైనా దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తునాయి. అదే స్థాయిలో మేం కూడా పన్నులు విధిస్తాం. కంపెనీ లేదా దేశం ఏదైనా సరే సుంకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని అమెరికా కోరుకుంటుంది. గతంలో మేం ఎప్పుడు అలా చేయలేదు. కానీ, ఇప్పుడు అందుకు సిద్ధమవుతున్నాం' అని ట్రంప్ అన్నారు.
ఇక గతవారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని, వ్యాపారం చేయటానికి కష్టమైన ప్రదేశమన్నారు. ఇక అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటిపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో మస్క్ అన్నారు. ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు 100 శాతం సుంకాలను భారత్ విధిస్తోంది. ఆటో దిగుమతులపై భారత్ 100 శాతం పన్ను విధిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు. భారత్ మాదిరిగా అనేక దేశాలు ఇలానే సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను 25 శాతం పన్నులు విధిస్తే, ఇంత భారీగా పన్నులు విధిస్తారా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.