Jaggery Health Benefits: జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే బెల్లం తినాల్సిందే! మలబద్ధకం సమస్య వేధిస్తోందా? దానికీ బెల్లమే పరిష్కారం! నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? బెల్లం ఉందిగా! ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ బెల్లాన్ని నేరుగా కంటే కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపు అవుతాయంటున్నారు. ఫలితంగా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని వెల్లడిస్తున్నారు. అజీర్తి దగ్గర నుంచి ఆకలిని అదుపు చేసే దాకా, నెలసరి సమస్యల్ని తగ్గించడం నుంచి చనుబాలు ఉత్పత్తి చేసే దాకా ఇలా ప్రతి ఒక్కటీ బెల్లంతో ముడిపడి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెల్లాన్ని ఏయే పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా బి-కాంప్లెక్స్, సి, డి 2, ఇ వంటి విటమిన్లు నిండి ఉన్న బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని వెల్లడిస్తున్నారు. దీని వల్ల బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గుతుందని వివరిస్తున్నారు. ఈ విషయం 2017లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన "Nutritional and Phytochemical Analysis of Jaggery and Its Potential Health Benefits" అనే అధ్యయనంలోనూ తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇలా తీసుకుంటే ప్రయోజనకరం!
బెల్లం+నెయ్యి : ఈ రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందచ్చు.
బెల్లం+ధనియాలు: ఇలా తీసుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పుల నుంచి విముక్తి పొందచ్చు. ఇంకా స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడే వారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పిరియడ్స్ ప్రారంభమవుతాయట.
బెల్లం+సోంపు: ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అంతేకాకుండా దంతాలపై పాచి పేరుకుపోకుండా చూసుకోవచ్చు.
బెల్లం+మెంతులు: ఇలా రెండు కలిపి తీసుకుంటే జుట్టు ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. కుదుళ్లు దృఢంగా మారడమే కాకుండా.. తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తపడచ్చు.

బెల్లం+గోంద్: ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ చక్కగా ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నార. అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు.
బెల్లం+అలీవ్ గింజలు: మనం తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఈ ఫుడ్ కాంబినేషన్ తోడ్పడుతుందని తెలిపారు. ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకూ దోహదం చేస్తుందని వివరించారు.

బెల్లం+నువ్వులు: ఈ రెండింటిని కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి దరిచేరకుండా కాపాడుతుంది.
బెల్లం+పల్లీలు: శరీరంలో సత్తువను పెంచడానికి, ఆకలిని అదుపు చేయడానికి, ఆహారపు కోరికల్ని తగ్గించడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు.
బెల్లం+పసుపు: ఈ రెండూ కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.
బెల్లం+శొంఠి పొడి: వీటిని కలిపి తినడం వల్ల జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇంకా శరీరంలోని వాపును తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ పేషెంట్లు ఈ 6 పండ్లను అసలు తినకూడదట! అవేంటో మీకు తెలుసా?
'ఇవి తింటే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది'- బెస్ట్ రిజల్స్ కోసం ఎప్పుడు తినాలి?