Miss World Competition 2025 in Hyderabad : 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. వచ్చే మే నెలలో 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహణ సంస్థ తెలిపింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
ప్రారంభ, ముగింపు వేడుకలు : 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో మే7 నుంచి మే 31 వరకు జరుగుతాయని నిర్వాహకులు బుధవారం తెలిపారు. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
మిస్ వరల్డ్ పోటీల గురించి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ కలిసి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో జరగనున్న 72వ అందాల పోటీల ఎడిషన్ గురించి మాట్లాడుతూ మోర్లీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను గొప్ప సంస్కృతి, ఆవిష్కరణలకు ఆతిథ్యమిచ్చే రాష్ట్రంగా ఆమె అభివర్ణించారు.
"తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ అద్భుతమైన వారసత్వం చూపించడానికి ఉపయోగపడుంది. ఈ సహకారం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం గురించి మాత్రమే కాదు, ఇది మహిళలకు సాధికారత కల్పించడం, అందం పట్ల ఐక్యంగా ఉండే మన నిబద్ధత, స్థిరమైన ప్రభావాన్ని చూపడం." -మోర్లీ, మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్
మా లక్ష్యం బ్యూటీ విత్ ఎ పర్పస్ : ఈ మిస్ వరల్డ్ పోటీలు 120 దేశాల నుంచి పాల్గొనే వారిని ఒకచోట చేర్చుతుందని, ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం మాత్రమే కాకుండా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 'బ్యూటీ విత్ ఎ పర్పస్' అనే లక్ష్యంతో పోటీ పడుతుందని మిస్ వరల్డ్ లిమిటెడ్ పేర్కొంది. పలు దేశాల ప్రతినిధులు మే 7వ తేదీన తెలంగాణకు వస్తారని తెలిపింది. చెక్ రిపబ్లిక్ నుంచి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్జ్కోవా తదుపరి ఎంపికయ్యే ప్రపంచ సుందరికీ కీరిటం అందించే కార్యక్రమం మే 31న ఘనంగా హైదరాబాద్‌లో జరుగుతుందని వెల్లడించింది.
"మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉంది. తెలంగాణ అనేది ప్రతి పండుగకు ఆనందాన్నిచ్చే ఒక వేదిక. ఈ వేదిక తెలంగాణ గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన గమ్యస్థానాలు, రుచికరమైన వంటకాలు, కళారూపాలు ప్రదర్శిస్తుంది" -స్మితా సభర్వాల్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి
మిస్ వరల్డ్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా- టాప్ 8లో సినీశెట్టి
మిస్ వరల్డ్ పోటీలుగా మారిన బికినీ కాంటెస్ట్- మినిమమ్ ఏజ్ 17- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?