Korean Bamboo Salt Production In India : ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు- వెదురు ఉప్పు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు. దీంతో వెదురు ఉప్పును వంటలో భాగం చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే ఈ వెదురు ఉప్పు(బాంబూ సాల్ట్) ధర మార్కెట్లో కేజీ రూ.20వేలు- రూ.30వేలు వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఉప్పును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్ సర్కార్ సిద్ధమవుతోంది. అసలెందుకు ఈ సాల్ట్ ధర అంత ఎక్కువ? దాన్ని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? తదితర విషయాలను తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ సర్కార్ కృషి
వెదురు ఉప్పును త్వరలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వెదురు ఉప్పు తయారీపై ట్రయల్స్ చేస్తున్నారు. ట్రయల్స్ పూర్తైన తర్వాత ఈ ఉప్పును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ అటవీ శాఖ ఆధ్వర్యంలోని బాంబూ అండ్ ఫైబర్ డెవలప్మెంట్ బోర్డు వెదురు ఉప్పు తయారీ కోసం ఈ కసరత్తు చేస్తోంది.
బాంబూ సాల్ట్ అంటే ఏమిటి?
మొదట్లో కొరియన్ ప్రజలు వెదురు ఉప్పును వాడేవారు. అందుకే దీనిని కొరియన్ సాల్ట్‌గా కూడా పిలుస్తారు. క్రమక్రమంగా ఈ ఉప్పునకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. వెదురు బొంగులో తయారుచేస్తారు కాబట్టి దీన్ని బాంబూ సాల్ట్ అని పిలుస్తారు.
![బాంబూ సాల్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/uk-deh-03-bamboo-salt-special-pkg-7206766_13022025232518_1302f_1739469318_54.jpg)
వెదురు ఉప్పును ఎలా తయారు చేస్తారంటే?
బాంబూ సాల్ట్ తయారీ ప్రక్రియ కాస్త కష్టతరమైనదే. తొలుత వెదురు బొంగుల్లో సముద్రపు ఉప్పును నింపుతారు. వెదురు బొంగు రెండు చివరలను మట్టి పూతతో మూసివేస్తారు. ఆపై ఉప్పుతో నింపిన ఈ వెదురు బొంగులను 300- 400 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాల్చుతారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇది మొదటి దశ. ఇలా సేకరించిన ఉప్పుని మళ్లీ వెదురులో వేడి చేస్తారు. ఇలా ఎనిమిది సార్లు చేస్తారు. తొమ్మిదో సారి ఉప్పుని కాల్చిన తర్వాత స్పటిక రూపంలోకి మారుతుంది. దాన్నే వెదురు ఉప్పు అంటారు.
ఉత్తరాఖండ్ సర్కార్ ట్రయల్స్
ఇప్పటి వరకు వెదురు బొంగులో ఉప్పును వేసి ఆరుసార్లు కాల్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇంకో మూడు సార్లు సాల్ట్‌ను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కాల్చితే బాంబూ సాల్ట్ తయారవుతుంది. అప్పుడు ఈ ప్రత్యేక ఉప్పును మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లోని ధరల కంటే తాము తయారుచేసిన బాంబు సాల్ట్‌ను తక్కువ ధరకు అందిచాలని ఉత్తరాఖండ్ సర్కార్ యోచిస్తోంది.
కిలో సాల్ట్ తయారీకి 20 రోజుల సమయం
ప్రపంచవ్యాప్తంగా వెదురు ఉప్పు(బాంబూ సాల్ట్)కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఉప్పునకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.2,40,000 కోట్ల మార్కెట్ ఉందని అంచనా. బాంబూ సాల్ట్ ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలో దాదాపు రూ.20వేలు-రూ.30వేలు వరకు ఉంటుందని అంచనా. ఒక కిలో సాల్ట్ తయారీకి దాదాపు 20రోజులు పడుతుంది. ఈ సాల్ట్‌లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఉప్పును పంజాబ్ సహా భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాలు తయారు చేస్తున్నాయి. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మార్కెట్లో తక్కువ ధరకు ఈ ఉప్పును అందించేందుకు ప్రయత్నిస్తోంది.
![ETV Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/uk-deh-03-bamboo-salt-special-pkg-7206766_13022025232518_1302f_1739469318_561.jpg)
ఆరోగ్య ప్రయోజనాలు?
బాంబూ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. అందుకే ఈ సాల్ట్ ధర అత్యధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు, 73 మినరల్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, బేరియం, జింక్ వంటి అనేక మూలకాలు ఇందులో ఉంటాయి. ఇక వెదురు ఉప్పు జీర్ణక్రియ సమస్యలకు బాగా పనిచేస్తుందని బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డాక్టర్ సుశాంత్ మిశ్ర తెలిపారు. ఎసిడిటీ, యూరిక్ యాసిడ్ వంటి సమస్యలను కూడా నివారిస్తుందని పేర్కొన్నారు. సాధారణ ఉప్పులో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుందని, దాని వల్ల బీపీ, గుండె జబ్బులు, చర్మ సమస్యలు వంటి సమస్యలు వస్తాయని వెల్లడించారు.
Himalayan Salt Vs Table Salt : హిమాలయన్ ఉప్పు Vs సాధారణ ఉప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ఉప్పు లేకుండా టేస్టీ ఫుడ్- ఈ 'ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్'తో తింటే మీ హెల్త్ అంతా సెట్!