GHMC is Survey Flood Water System : గ్రేటర్‌కు వానాకాలం వచ్చిందంటే చాలు వణుకు పుడుతుంది. చిన్న చినుకు పడినా రోడ్లు, కాలనీలు, వీధులు జలమయం అయిపోతాయి. మూసీ నది పరివాహన ప్రాంతాలైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్లు మునిగిపోతాయి. అక్కడే కాకుండా గ్రేటర్‌లో చాలా కాలనీల్లో ఇళ్లు వరద నీటికి మునిగిపోతాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించి వాహనదారులను, ప్రయాణికులను, పాదచారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియని పరిస్థితి వరద నీరు ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఈ సమస్య వానాకాలంలోనే కాకుండా ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఈ సమస్య పెద్ద సవాల్‌గా మారుతోంది.
దీనికి బల్దియా ఎన్ని చర్యలు తీసుకున్నా ఆఖరికి వాన పడినప్పుడు మళ్లీ పాత దృష్యాలే కనిపిస్తున్నాయి. గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న ఎలాంటి ఉపయోగం లేదు. ఆ నాలాలు వర్షం పడినప్పుడు ఏరులై పొంగిపోర్లుతుంటాయి. వరద నీటితో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి దోమలు, ఈగలు వంటివి వ్యాపించి, గ్రేటర్ పరిధిలోని ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ సమస్య ప్రతి ఏడాది రావడంతో ఆలోచనలో పడిన జీహెచ్‌ఎంసీ.. పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు మార్గాలను అన్వేషించింది.
ఈ క్రమంలో ఇక నుంచి వరద నీటి సమస్య నుంచి గట్టెక్కికేందుకు బల్దియా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కృత్రిమ మేథ(ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రధాన రహదారులు, కాలనీలు వారీగా ఉన్న భూగర్భ వరదనీటి వ్యవస్థ, చెరువులను జియోట్యాగ్, పైకప్పులు లేని నాలాలు వంటి వాటిని 100 శాతం కచ్చితత్వంతో గుర్తించేందుకు ఐటీ విభాగం రంగం సంసిద్ధం అయింది. అందుకోసం డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ విధానం) సాంకేతికతను ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా ఐదు డివిజన్లలో నేటి నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇందుకు ఆర్క్‌జీఐఎస్ పేరుతో ఇప్పటికే యాప్‌ను రూపొందించారు.
ముంపు ప్రాంతాలను ముందే ఊహించవచ్చు : వర్షాకాలంలో ముంపు సమస్య నివారణకు వరదనీటి వ్యవస్థ మ్యాపింగ్‌పై బల్దియా ఇప్పటికే దృష్టి సారించింది. ఈ క్రమంలో నగరంలో జీహెచ్‌ఎంసీ ఇప్పటికే సర్వే చేస్తోంది. సమగ్ర వివరాలు సేకరిస్తే విపత్తు నివారణ చర్యలు సులభతరం అవ్వడమే కాకుండా నాలాల మ్యాపింగ్‌ను ప్రాంతాలు, రహదారుల వారీగా ఏఐ సాయంతో విశ్లేషించవచ్చును. నాలాల సామర్థ్యం, వర్షపాతం ఆధారంగా దగ్గరలోని ముంపు ప్రాంతాలను ముందే ఊహించవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
జియో ఫెన్సింగ్ : వరద సమస్యకు పరిష్కారమే కాకుండా కాలనీ పార్కులు, వాటి హద్దులను జియో ఫెన్సింగ్ చేయాలని బల్దియా నిర్ణయం తీసుకుంది. ఎన్నెన్ని ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయని, అవి పనిచేస్తున్నాయా లేకుంటే పని చేయడం లేదా అనే కారణాలను యాప్‌లో నమోదు చేయనున్నారు. కాలనీల్లో ఖాళీ స్థలాలు, వాటి స్థితిగతులను లెక్కగట్టనున్నారు. డ్రోన్లతో చిత్రీకరించిన డిజిటల్ పటంపై వివరాలను పొందుపరిచి జాగ్రత్త పరచనున్నారు.