Caste Census Resurvey in Telangana : సమగ్ర కులగణనలో పాల్గొనని వారి వివరాలను అధికారులు రేపటి నుంచి నమోదు చేయనున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి వివరాలను నమోదు చేసుకోనున్నారు. కులగణన కోసం 040-21111111 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంటుందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి మరీ సంబంధిత వివరాలను నమోదు చేస్తారని వెల్లడించారు.
అందుబాటులోనే ఎన్యూమరేటర్లు : గ్రామీణ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాలు, నగరాల్లో వార్డు, డివిజన్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కార్యాలయాల్లో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. కులగణన సర్వే వెబ్‌సైట్ https://seeepcsurvey.cgg.gov.in నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని దానిని నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అందజేయవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 56 వేల 323 కుటుంబాల వివరాలు గతంలో జరిగిన కులగణనలో నమోదు కాలేదని ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
కులగణన సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్‌లకు సామాజిక బహిష్కరణే శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి