Deputy CM Bhatti Vikramarka Review : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. రెవెన్యూ, హౌజింగ్, ఐ అండ్ పీఆర్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు.
మొదటి దశలో కేటాయించిన 70వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అవుటర్ రింగురోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి అవసరమైన భూసేకరణ కోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని భట్టి విక్రమార్క తెలిపారు.
డిజిటల్ భూముల సర్వే : ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రెవెన్యూ శాఖ పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములను దక్కించుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక చేసుకోవాలని, న్యాయవాదులతో నిరంతరం చర్చించాలని సూచించారు. డిజిటల్ భూముల సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతీ నెల సకాలంలో అద్దె చెల్లించేందుకు ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
లఘు చిత్రాలకు ప్రభుత్వం ప్రోత్సాహం : ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు విస్తృత ప్రచారం చేయాలని సమాచార, ప్రజా సంబంధాల అధికారులకు డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క తెలిపారు. లఘు చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, హౌజింగ్ ఎండీ గౌతమ్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క క్లిక్‌తో "ఇందిరమ్మ ఇళ్ల" స్టేటస్ - ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి!
" తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇస్తున్నాం"