Youth Addiction To Online Betting Games : కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని యువత ఆన్‌లైన్ రమ్మీ, క్యాసినో, రౌలట్ ఆటలకు అలవాటవుతున్నారు. నిర్వాహకులు మొదట చిన్న మొత్తంలో డబ్బుల ఆశ చూపి, నెమ్మదిగా పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. మళ్లీ పోయిన డబ్బులు సంపాదించాలని అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. అప్పులు తీర్చేందుకు కొంతమంది ఆస్తులు అమ్ముతుండగా, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
సరదాగా ఆడి వ్యసనంగా మారి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీనేజర్లలో సుమారు 70 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతానికి పైగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మొదట సరదా ఆటలు, తర్వాత వ్యసనంగా మారుతున్నాయి. స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి ఇలా అందినకాడికి డబ్బులు తెచ్చుకొని జూదంలో నష్టపోతున్నారు. మరికొందరు రుణ యాప్‌ల్లో అప్పులు తీసుకొని ఆన్‌లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. ఇందులో 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం కలవరపెడుతోంది.
ఎక్కడిదో లింకు - ఇక్కడ ఆటలు : ఆన్‌లైన్ జూదంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. పేకాట, జూదం బయటే కాదు, ఆన్‌లైన్‌లో ఆడినా నేరమే. అయినా ఆన్‌లైన్ జూదం నడిపించేందుకు ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్‌ను తారుమారు చేస్తూ ఎక్కడో ఉన్న లింకుతో ఇక్కడ ఆడేస్తున్నారు. ఐపీ అడ్రస్ వేరే రాష్ట్రంలో ఉన్నట్లు కనిపించేలా చేస్తారు.
అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు
- శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన మధు (35) అనే యువకుడు ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి రూ.లక్షలు పోగొట్టుకొన్నాడు. తర్వాత అప్పుల బాధతో వారం రోజుల కిందట పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన కార్తిక్ (25) ఆన్‌లైన్ రమ్మీ ఆడి సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టపోయి మనస్తాపంతో పురుగుల మందు తాగి జనవరి 30న చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- కరీంనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ జూదానికి బానిసయ్యాడు. అప్పులు తెచ్చి, క్రెడిట్ కార్డు డబ్బులతో ఆన్‌లైన్‌లో ఆటలు ఆడి సుమారు రూ.70 లక్షలు నష్టపోయాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ధైర్యం చెప్పి ఆస్తులను అమ్మి అప్పులు కట్టారు.
రాష్ట్రంలో ఆన్‌లైన్ జూదం నిర్వహించినా, ఆడినా తెలిసేలా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ రూపొందిస్తుంది. బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్లను ప్రమోట్ చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా పెడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ నియంత్రణకు ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తోంది.
గుర్తించండి - రక్షించండి
- ఆన్‌లైన్ జూదానికి అలవాటుపడిన వారు ఒంటరిగా ఫోన్లోనే గడుపుతుంటారు
- పిల్లల బ్యాంకు ఖాతాలను తల్లిదండ్రులు పరిశీలించాలి. అనుమానాస్పదంగా డబ్బులు వచ్చినా, పోయినా బ్యాంకుకు వెళ్లి ఖాతాను బ్లాక్ చేయించాలి.
- స్నేహితులు, సహోద్యోగులను ఎక్కువసార్లు డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరాలి.
- బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారిపై కోపగించడం, సూటిపోటి మాటలు అనకుండా ధైర్యం చెప్పాలి.