Story On Yeru Festival At Bhadradri : ఏరు మహోత్సవం ఊరు, నీరు, కొండకోనల పరిమళాలను వెదజల్లుతోంది. ‘ప్రకృతిని ఆస్వాదించాలి, కాపాడాలి’ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. భద్రాచలం మన్యంలో ఎంపిక చేసిన ప్రాంతాలను ఏరు ఉత్సవంలో చేర్చటంతో పర్యాటకులకు ఈ యాత్ర మానసికోల్లాసాన్ని కలిగిస్తోంది. పల్లెల్లోని సహజసిద్ధ వనరులు, సంస్కృతి, సంప్రదాయాలను నేటితరానికి తెలియజెప్పేందుకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పీఓ రాహుల్ చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగానే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈఏడాది జనవరి 10న ఏరు మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఆకర్షణీయ ప్యాకేజీలు : తొలుత ఆర్భాటంగా ప్రచారం సాగించటం వల్ల ఆధ్యాత్మిక-టూరిజం అభివృద్ధికి వేగంగా అడుగులు పడతాయని అంతా భావించారు. 3 రోజుల ప్యాకేజీ కింద కనకగిరి గుట్టలు, బొజ్జిగుప్ప పర్యటనతో పాటు భద్రాచలం కుటీరాల బసకు కలిపి ఒక్కొక్కరికి ధర 6వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ మూడు ప్రాంతాలకు వెళ్లటం అందరికీ కుదిరే పనికాదు. కొంతమంది పర్యాటకులు ఒక్కరోజు కంటే అధిక సమయం కేటాయించలేకపోతున్నారు. దీనిపై సమాలోచనల చేసిన అధికారులు ఒక్కరోజుకు గాను ఆకర్షణీయమైన పర్యాటక ప్యాకేజీలను ప్రకటించారు.
చూడాల్సిన ప్రదేశాలు : చంద్రుగొండ మండలం బెండాలపాడులోని కనకగిరి కొండలు భూలోక స్వర్గాన్ని తలపిస్తున్నాయి. బెండాలపాడులోని కుటీరాల్లో శనివారం రాత్రి బస చేయవచ్చు. ఆదివారం ఉదయం ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కనకగిరి కొండ వ్యూ పాయింట్‌కు చేరుకుని అటవీ పచ్చదనాన్ని చూస్తే మంత్రముగ్ధులవుతారు. ఆదివాసీ కళాకృతులను చూడవచ్చు. ఒక్కరోజు యాత్రకు ఒక్కొక్కరు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగూడెం నుంచి బెండాలపాడు వరకు రవాణా, రాత్రి బస, క్యాంప్ ఫైర్, గిరిజన నృత్యం, భోజన సౌకర్యం ఈ ప్యాకేజీలో భాగం.

- దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్పలో ‘ట్రైబల్ ఈవెనింగ్’ వేడుక సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. పంటపొలాలతో పాటు ఆదివాసీల ఆవాసాలు, ఆహార అలవాట్లను పరిశీలించవచ్చు. క్యాంప్ ఫైర్, రేలా నృత్యప్రదర్శనలు ఉంటాయి. సరదాగా ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను గురిచూసి కొట్టవచ్చు. రాత్రి రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.600. నాన్‌వెజ్‌కు రూ.100 అదనం. బస సదుపాయం లేదు.
- భద్రాచలం గోదావరి గట్టుపై కుటీరాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. సెల్ఫీ పాయింట్‌లో గోదావరి అందాలను బంధించవచ్చు. ఇక్కడ రాత్రి బసకు పెద్దలకు రూ.500. ఇందులో భాగంగా వేడి నీళ్లు, సోలార్ విద్యుద్దీపాల వెలుగులు, క్యాంప్ ఫైర్ ఉంటాయి. ఫుడ్ కావాలంటే ఆర్డర్‌పై తీసుకొస్తారు.
- భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) మ్యూజియంలో ఆదివాసీ గృహోపకరణాలతో పాటు ఆయుధ సామగ్రిని కూడా చూడవచ్చు. ఈ ప్రాంగణంలో ఆదివాసీ ఆవాసాలుతో పాటు ఓపెన్ జిమ్ ఉన్నాయి. పర్యాటకులు కిన్నెరసాని బోట్ షికార్‌తో పాటు పర్ణశాల తదితర ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
ఇప్పటి వరకు సందర్శించిన పర్యాటకులు :
- దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప ఆదివాసీ గ్రామం : 30 మంది సందర్శించారు
- కనకగిరి గుట్ట ట్రెక్కింగ్ : 14 మంది (మరో 120 మంది త్వరలో వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయించారు)
- భద్రాచలం గోదారి గట్టు కుటీరాలు: 75 మంది సందర్శించారు.
"ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు సోషల్ మీడియా ద్వారా ఏరు ఉత్సవానికి ముమ్మర ప్రచారం కల్పిస్తున్నాం. పర్యాటకుల అభిప్రాయాలకు అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం" -వెంకటేశ్వర్లు, క్యాంప్ ఇన్‌ఛార్జి
ఈ హాలిడేస్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - అయితే మీకోసమే ఈ రివర్ ఫెస్టివల్!
ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మాల్దీవులను మరిపించే టూరిస్ట్ స్పాట్ మన రాష్ట్రంలోనే