20 Thousand Acres Of Ponds Encroached In Telangana : రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా చెరువుల్లో దాదాపు 20వేల ఎకరాల విస్తీర్ణంలో పట్టాలు సృష్టించిన ఆక్రమణదారులు గత ఆరేళ్లలో రూ.కోట్ల ప్రజాధనాన్ని రైతుబంధు పేరుతో స్వాహాచేశారు. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలకు సంబంధించి సాగుయోగ్తయ లేని భూములను రైతుబంధు ఇచ్చారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు విస్తుగొలిపే విషయాలెన్నో తెలిశాయి.
చెరువుల శిఖం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లలోని భూములను అక్రమంగా పట్టా చేయించుకుని రైతుబంధు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సంయుక్త సర్వే పూర్తయితే ఈ విస్తీర్ణం అమాంతం పెరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3వేలకు పైగా ఎకరాలకు పలు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టాలున్నట్లు గుర్తించిన అధికారులు వాటికి రైతుభరోసా నిలిపేశారు. కబ్జాలకు కొన్నిచోట్ల అధికారులూ సహకరిస్తున్నట్లు సంయుక్త సర్వేలో గుర్తించినట్లు తెలిసింది. మరోవైపు చాలాచోట్ల చెరువులకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ శాఖల వద్ద సరైన రికార్టుల లేవు.
రైతుభరోసా నుంచి తొలగింపు : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని చింతల చెరువు వాస్తవ విస్తీర్ణం 62 ఎకరాలు. ఇందులో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలోని 32 ఎకరాలను కొందరు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారు. అలా గత ఆరేళ్లుగా రైతుబంధు పొందారు. తాజాగా నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ పట్టాలను రద్దుచేయడానికి రెవెన్యూశాఖకు లేఖ రాశారు. ఈ విస్తీర్ణాన్ని రైతుభరోసా జాబితా నుంచి తొలగించారు. చెరువులోని మరో 20 ఎకరాలను కొందరు రియల్టర్లు, ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఇక్కడ ఎకరా రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న చెరువులను గుర్తించి, వాటికి హద్దులను నిర్ణయించి, చుట్టూ ఫెన్సింగ్ లాంటి నిర్మాణాలను చేపట్టాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ లేకపోవడంతో : పలుచోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సహాయంతో హద్దుల నిర్ధారణకు చర్యలు చేపట్టినా.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి అప్పట్లో ఆశించిన సహకారం లభించలేదు. దీంతో కార్యరూపం దాల్చలేదు. అలా చాలా చెరువులు కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. ఆరేడేళ్లుగా గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ లేకపోవడమూ చెరువులు వేగంగా కబ్జాలకు గురవడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు.
కొన్ని చెరువుల సమాచారం లేకపోవడంతో : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అక్రమ పట్టాలున్నట్లు గుర్తించిన అధికారులు తొలిదశలో రైతుభరోసా నిధులు పొందకుండా ఆపగలిగారు. అయితే ఆ పట్టాలను రద్దుచేసి, కబ్జాలను తొలగించి శాశ్వత చర్యలు తీసుకుంటేనే నీటివనరుల రక్షణకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘చెరువుల పరిరక్షణలో రికార్డులే కీలకం. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం చెరువులకు సంబంధించి సరైన సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే హద్దుల నిర్ధారణ జరగడం లేదని పేర్కొన్నారు. పాత దస్త్రాలను వెలికితీసి ప్రతి చెరువుకు రికార్డులను అనుసరించి హద్దులు గుర్తిస్తేనే నీటి వనరులను సంరక్షించగలమని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
65ఎకరాలు గుర్తించి : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జైసేవాలాల్ కమ్మరిపేట తండాలోని రంగినేని చెరువు విస్తీర్ణం ఎంతో నీటిపారుదలశాఖ రికార్డుల్లో లేదు. దీంతో పలువురు చెరువును మట్టితో నింపుతూ వ్యవసాయ భూములుగా మార్చేశారు. ఇప్పటివరకు 65 ఎకరాలను గుర్తించి రైతుభరోసా నుంచి తొలగించారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్‌పూర్ రంగం చెరువు. మొత్తం విస్తీర్ణం 80 ఎకరాలు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌లో 31 ఎకరాలకు పట్టాలున్నట్లు నీటిపారుదల అధికారులు గుర్తించారు.