Top 10 Businesses Under 50000 : చాలామందికి వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంటుంది. అయితే అది ఆషామాషీ విషయమేం కాదు. ఎందుకంటే బిజినెస్ కోసం పెట్టుబడి కావాలి. తగినంత డబ్బు లేక ఎంతోమంది వ్యాపారాన్ని ప్రారంభించరు. తమ బిజినెస్ ఐడియాను ఆలోచన దశలోనే సమాధి చేస్తుంటారు. బ్యాంకు రుణాలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందొచ్చనే అవగాహన లేక నైరాశ్యానికి గురవుతుంటారు. అలాంటి వాళ్లంతా వీలైనంత తక్కువ పెట్టుబడితో, గరిష్ఠంగా రూ.50వేలతో చేయగలిగిన వ్యాపారాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఆ వివరాలు చూద్దాం.
హోం మేడ్ ఫుడ్ సర్వీసులు
రుచికరమైన వంటకాలు, పిండి వంటలను తయారు చేసే నైపుణ్యం ఉన్నవాళ్లు 'హోం మేడ్ ఫుడ్ సర్వీసులు' ప్రారంభించవచ్చు. అల్పాహారం (టిఫిన్), పిండి వంటలు తయారు చేసి ప్రముఖ హోటళ్లకు సప్లై చేయొచ్చు. లేదంటే ఏదైనా బిజీ సెంటర్‌కు సమీపంలో స్వయంగా ఫుడ్ స్టాల్‌ను నడపొచ్చు. వంటపాత్రలు, వంటగ్యాస్, తయారీ మెటీరియల్‌ను సమకూర్చుకోవాలి. అరటి ఆకుల్లో ఫుడ్ ఐటమ్స్‌ను సర్వ్ చేస్తే ఆహార ప్రియులు చాలా ఇంప్రెస్ అవుతారు. రుచికరంగా, పరిశుభ్రంగా వంటకాలు ఉంటే అనతికాలంలో మంచి పేరును సంపాదించొచ్చు.
కుకింగ్ క్లాసులు
మీరు ఇంట్లోనే కుకింగ్ క్లాసులు మొదలుపెట్టొచ్చు. సంప్రదాయ వంటకాలు, పిండి వంటలు, చాక్లెట్స్, కేకుల తయారీని నేర్పించవచ్చు. ఔత్సాహికులు వచ్చి నేర్చుకుంటారు.
డే కేర్ సెంటర్
పిల్లలతో గడపడం అంటే మీకు ఇష్టమా ? అయితే మీరు డే కేర్ సెంటర్‌ను తెరవొచ్చు. దీనికి తక్కువ పెట్టుబడే అవుతుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకొని, వారికి కనీస విద్యాబుద్ధులు నేర్పించగలిగితే చాలు. మీ క్రెడిబులిటీ పెరుగుతుంది. ఫలితంగా క్రమంగా క్లయింట్లు పెరుగుతారు.
కోచింగ్ క్లాసులు
మీరు టీచింగ్ చేయగలరా? అయితే కోచింగ్ క్లాసులు చెప్పండి. ఏదైనా చిన్నపాటి గది, కూర్చోవడానికి బల్లలు, బ్లాక్ బోర్డు, మార్కర్ పెన్ వంటివి సమకూర్చుకుంటే సరిపోతుంది. కరోనా సంక్షోభ కాలం తర్వాత మన దేశంలో ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. అందుకోసం మీకు ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
ఫ్రీలాన్స్ రైటింగ్
మీరు ఏదైనా ఒక విషయాన్ని వివరంగా, సులభంగా రాయగలరా ? అయితే ఫ్రీలాన్స్ రైటర్‌గా మంచి పేరు, ఆదాయం సంపాదించొచ్చు. సొంతంగా ఆన్‌లైన్‌లో ఒక బ్లాగ్ లేదా వెబ్‌సైటును నడపొచ్చు. మీకు ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నిత్యం రాసేందుకు సిద్ధంగా ఉంటే, ఇది మీకు మంచి కెరీర్ ఆప్షన్ అవుతుంది.
వ్లాగింగ్
మీకు మాట్లాడటం, ఏదైనా విషయం గురించి అర్థమయ్యేలా వివరించడం ఇష్టమా? అయితే వ్లాగింగ్ చేసేయండి. మంచి స్మార్ట్ ఫోన్, కెమెరా ఉంటే సరిపోతుంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రఖ్యాత వేదికల్లో మీ వ్లాగ్‌లను పబ్లిష్ చేయొచ్చు. మీకు ఒక్కసారి మానిటైజేషన్ లభిస్తే, ప్రతినెలా కొంత ఆదాయం వస్తుంది. ఇందుకు అదనంగా యాడ్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సంపాదన సమకూరుతుంది.
అఫిలియేట్ మార్కెటింగ్
ఈ-కామర్స్ ఇప్పుడు రెక్కలు తొడిగింది. జనం పెద్దసంఖ్యలో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ మార్పును బిజినెస్‌గా మార్చుకోవాలని భావించే వారు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. కొన్ని ప్రఖ్యాత ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసి, వాటి సేల్స్ జరిగినప్పుడల్లా ఆకర్షణీయమైన కమీషన్లను అందుకోవచ్చు. ఇందుకోసం ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అమెజాన్ వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో విక్రయించే ఉత్పత్తులను అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇది పార్ట్ టైంగా చేస్తే బెటర్.
వర్చువల్ ఫిట్‌నెస్ ట్రైనర్
మీకు ఫిట్‌నెస్, యోగా, మెడిటేషన్ వంటి వాటిలో అనుభవం ఉందా ? అయితే ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారండి. ఇందుకోసం ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది.
ఆర్గానికి ఫామింగ్
సేంద్రియ పంటలకు డిమాండ్ పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సాగు చేయడం వల్ల సేంద్రియ పంటలు, ఆహార ఉత్పత్తులను తినేందుకు జనం ఆసక్తిని కనబరుస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే కూరగాయలు, మూలికలు, పండ్లకు భారీ గిరాకీ ఉంది. ఉన్నత వర్గాల వారు వీటి కోసం ఎంత రేటైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇంటి పైకప్పుపై, పెరటిలోనూ సేంద్రియ సాగు చేయొచ్చు.
బీమా ఏజెంట్
మీకు ఒకవేళ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బీమా ఏజెంట్ కావొచ్చు. బీమా పాలసీలను విక్రయించడం ద్వారా ఆకర్షణీయమైన కమీషన్లను సంపాదించొచ్చు.
డ్రాప్ షిప్పింగ్
ఇన్వెంటరీ(స్టాక్)తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయించే వెసులుబాటు డ్రాప్ షిప్పింగ్‌లో ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్ చేసేవారు ఆన్‌లైన్‌లో వస్తువులు/ఉత్పత్తులు కొనేవారికి, సప్లై చేసే వారికి మధ్యవర్తులుగా ఉంటారు. కస్టమర్ల నుంచి మీకు ఆర్డర్లు వస్తాయి. ఆ వివరాలను మీరు సప్లయర్లకు పంపుతారు. సప్లయర్లు నేరుగా ఆ వస్తువు లేదా ఉత్పత్తిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. అంటే స్టాక్‌ను నిల్వ చేయడం, డెలివరీ చేయడం వంటి పనులన్నీ మీకు తప్పుతాయి.