Delhi Results 2025 Kejriwal : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో రెండు సార్లు విజయం సాధించిన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈసారి ఓటమి తప్పలేదు. ఆయనతో పాటు అగ్రనేతలు మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఓడిపోయారు. వివిధ కేసుల్లో ముగ్గురూ జైల్లో ఉన్న నేతలే కావడం విశేషం. బీజేపీ కావాలనే తమ నేతలను జైలుకు పంపించింది అని ప్రచారాలు చేసినా దిల్లీ ప్రజలు ఏ మాత్రం ఆప్ వైపు మొగ్గు చూపలేదు. బీజేపీకే పట్టం కట్టారు. రెండోసారి అధికారం ఆప్ నేతలకు కలిసిరాని కాలంగా మారింది. ప్రజలను ఆకట్టుకునేలా ఎన్ని విధలుగా ప్రయత్నం చేసినా ఆప్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జంగ్‌పురలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. తూర్పు దిల్లీలోని పట్‌పర్‌గంజ్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సిసోదియాకు ఈ ఎన్నికల్లో పార్టీ జంగ్‌పురా టికెట్‌ను ఇచ్చింది.
కొంపముంచిన లిక్కర్ స్కామ్
అర్వింద్ కేజ్రీవాల్‌ను రెండోసారి సీఎంగా చేయడానికి ముఖ్య కారణం ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణ లేకపోవడమే. విద్య, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు కూడా పదవిని చేపట్టేలా చేశాయి. కానీ, మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 2024 మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు మనీశ్ సిసోదియా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రజల్లో ఆప్ నేతలు తప్పు చేశారన్న అభిప్రాయం వచ్చింది. ఎన్నికల్లో బీజేపీనే తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రచారాలు చేసిన దిల్లీ ప్రజలు మాత్రం కేజ్రీవాల్‌పై నమ్మకం చూపలేదు. దీంతో హ్యాట్రిక్ దూరమయ్యారు.
ఆ స్కాంతో సిసోదియాకు కష్టకాలం
ఆప్ ప్రభుత్వం తొలి టర్మ్‌లో దిల్లీ ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మించారన్న మంచి పేరు మనీశ్ సిసోదియాకు ఉంది. అయితే రెండవ పర్యాయంలో దిల్లీ మద్యం పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల ఆయనకు కష్టకాలం మొదలైంది. సీబీఐ 2023 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత పదవికి రాజీనామా చేశారు. దాదాపు 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.
సత్యేందర్ జైన్
కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి లావాదేవీల విషయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2022 మే 30న సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన రెండేళ్ల తర్వాత తిహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు.