BJP Won Delhi Elections 2025 : దిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆప్‌ను గద్దె దించి 27 ఏళ్ల తర్వాత దిల్లీ కోటపై ఎగిరిన కాషాయజెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటింది. బీజేపీ దెబ్బకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఆప్ కంచుకోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలుకొట్టారు. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలిచిన ఆప్ ఈసారి ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ ఈసారీ ఖాతా తెరవలేదు.
సుదీర్ఘ కాలం పాటు దేశ రాజధానిలో అధికారం లేకుండా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందేనని పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోలేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాల వరకు బీజేపీ అధిష్ఠానం పక్కాగా పర్యవేక్షించింది. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ అభ్యర్థిత్వం కూడా బీజేపీ ఆచితూచి ప్రకటించింది.
బీజేపీకి అనకూలించిన అంశాలు
- దిల్లీ లిక్కర్ స్కామ్, గాలి కాలుష్యం, వరదలు, యమునా నది కాలుష్యం అంశాలపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసింది. అవినీతి వ్యతిరేక పునాదులపై నిర్మితమైన ఆప్‌పై అవినీతి ఆరోపణలను ప్రజలల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ పెద్దల వ్యూహాలు ఫలించాయి.
- తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలే ప్రధాన అస్త్రంగా ఆప్ ఎన్నికల బరిలోకి దిగింది. మిగతా సమస్యలపై తూతూమంత్రంగానే హామీలు గుప్పించింది. అయితే గతే రెండు పర్యాయాలుగా ఉన్న ప్రభుత్వం వ్యతిరేకతకు తోడు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఆప్‌నకు పోటీగా ఉచితాలు ప్రకటించింది. ఇది వరకే అమలులో ఉన్న పథకాలను తొలగించమని, అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
- బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థగతంగా పక్క ప్రణాళిక రూపొందించుకుంది బీజేపీ. అగ్రనేతలను ఇంఛార్జులుగా నియమించింది. దిల్లీ ప్రజలు క్షేత్ర స్థాయిలో అనుభవిస్తున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. స్థానిక సంక్షేమ సంఘాల స్థాయిల్లో వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సమస్యలకు ప్రజలకు అవగాహన కల్పించింది.
- తమకు ఓటు వేస్తారనుకున్న ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సొంతూర్లకు వెళ్లినవారిని ఫోన్లు చేసి మరీ రప్పించే ప్రయత్నం చేసింది బీజేపీ. దీనికి తోడు ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ హవా బీజేపీకి అనుకూలించింది.
- మధ్యతరగతి ప్రజలపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఆఖరి నిమిషంలో- వారికి ఉపశమనం కలిగించేలా రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా బీజేపీకి ప్లస్ అయింది.
- కాలుష్యంతో పాటు దిల్లీ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు రోడ్లు, సీవరేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం. ఈ పరిస్థితికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడడమే కారణం అని ఆప్ ఆరోపించింది. అయితే, రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ ఉంటే పనులు సులువుగా జరుగుతాయనే భావన దిల్లీ ప్రజల్లో కలగడం బీజేపీకి అనుకూలించింది. ఇలాంటి సమస్యలను ఆప్ నుంచి బయటకు వచ్చి స్వాతీ మల్లివాల్ వంటి వారు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆప్ పాలనలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.