Hyderabad Minors Misbehavior : రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రద్దీ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్, పర్యాటక ప్రదేశాలు వంటి చోట ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వారిపై లైంగిక దాడికి పాల్పడటం, లేదంటే వెకిలి చేష్టలు చేయడం చేస్తున్నారు. ఈ మధ్యనే బోరబండకు చెందిన ఇద్దరు విద్యార్థులు నుమాయిష్‌లో యువతులను తాకేందుకు ప్రయత్నిస్తూ, కొందరితో వెకిలి చేష్టలకు పాల్పడుతూ హల్‌చల్ చేశారు. వారిని షీటీమ్స్ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా షీటీమ్స్‌కు పట్టుబడుతున్న మైనర్ల సంఖ్య ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే జైలు జీవితం అనుభవించాల్సిందే అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రద్దీ ప్రాంతాలే వారి లక్ష్యం : నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, విద్యా సంస్థలున్న చోట ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. వీటిలో అత్యధికంగా గోల్కొండ, చార్మినార్, రేతిఫైల్, అమీర్‌పేట్ షాపింగ్ ఏరియా, దిల్‌సుఖ్‌నగర్ బస్టాపుల్లో వీరి ఆగడాలు మాత్రం శ్రుతి మించిపోతున్నాయి. ఎవరూ చూడటం లేదన్న ధీమా, అలాంటి ప్రదేశాల్లో ఎవరు పట్టించుకుంటారులే అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారు.
పెంపకంలో తప్పటడుగులు : మహిళలను వేధిస్తూ పట్టుబడుతున్న మైనర్లలో అధిక శాతం వివాహేతర సంబంధాలు, కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న కుటుంబాల్లోని పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలే ఉంటున్నట్లు కౌన్సెలింగ్ సమయంలో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా పసిమనసును కలుషితం చేస్తున్నాయి. దీంతో మహిళల పట్ల గౌరవంగా మెలగటం ఎలానో తెలుసుకోలేకపోతున్నారు. ఎదిగే వయసులో పెద్దల పర్యవేక్షణ కరవై, నేరాల బాట పడుతున్నారు. మద్యం, వైట్నర్, గంజాయి వంటి దురలవాట్లకు అలవాటు పడి అర్ధరాత్రిళ్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ కనిపించిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే వేధిస్తున్నారు.
ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు : కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం, కన్నవారి పర్యవేక్షణ లోపం ఉండటం వల్ల మైనర్లు ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పేర్కొన్నారు. మనో జాగృతి సంస్థ ద్వారా ఆకతాయిలకు రెండుసార్లు కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఆమె తెలిపారు. మూడు నెలల అనంతరం కౌన్సెలింగ్‌కు 70 శాతం మంది హాజరయ్యారని వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఒక్కశాతమే మళ్లీ పోలీసులకు చిక్కుతున్నారని, ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే చాలని ఆమె చెప్పారు.
గర్భిణీపై లైంగిక వేధింపులు- కదులుతున్న ట్రైన్ నుంచి తోసేసిన కామాంధుడు
మందుతాగి భర్తల వేధింపులు- పెళ్లి చేసుకున్న వారి భార్యలు! ఎక్కడో తెలుసా?