Bypoll Results 2025 : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఎదురైన ఓటమికి తాజాగా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై 61,710 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాసవాన్ గెలుపొందారు.
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ ఓడిన ఏకైక నియోజకవర్గం మిల్కిపుర్. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాజ్‌వాదీ పార్టీ నేత అవధేశ్ ప్రసాద్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య భాగమైన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని కోల్పోవడం బీజేపీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది.
ఈ క్రమంలోనే మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను కమలదళం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడ నుంచి అవధేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులూ ఒడ్డింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మిల్కిపుర్‌లో నెగ్గి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్‌లో ఎదురైన ఓటమికి బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది.
డీఎంకే పార్టీ విజయం
మరోవైపు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్ ) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఎంకే సీతాలక్ష్మీపై 90వేల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్ధి చంద్ర కుమార్ గెలుపొందారు. 2021లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన తిరుమగన్ ఈవెరా మృతి చెందారు. అనంతరం 2023 ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ విజయం సాధించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతి చెందడం వల్ల మళ్లీ ఉపఎన్నిక అనివార్యమైంది.