BJP Winning Reasons in Delhi : దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 27 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దిల్లీ సీఎం కుర్చీని సొంతం చేసుకుంది. అందుకోసం తీవ్రంగానే కసరత్తు చేసింది. ఆప్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం కమలదళం పక్కా ప్రణాళికలు రచించింది. అసలు దిల్లీలో గెలుపు కోసం బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసింది? విజయానికి గల కారణలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హామీల వర్షం
దిల్లీ ప్రజల కోసం బీజేపీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టోను ప్రకటించింది. పేద కుటుంబాలకు రూ.500 వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకర్షించింది. ఇక కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు ద్వారా దిల్లీలోని మధ్యతరగతిని ఆకట్టుకుంది. అసలే దిల్లీలో మధ్య తరగతి ప్రజలే 67శాతం మంది ఉన్నారు.
వ్యతిరేక ఓటర్లపైనే ఫోకస్
దిల్లీలో విజయం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో ప్రణాళికలు చేసింది. ప్రతి బూత్‌లో కనీసం 50శాతం ఓట్లు, అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20వేల ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్ఠానం దిశా నిర్దేశం చేసింది. ఎన్నికలకు ముందే కొన్ని నెలల పాటు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణ్నంగా పరిశీలించింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వచ్చింది. తర్వాత వ్యతిరేక ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు వారి కోసం అనేక హామీలను ప్రకటిచింది.
మోదీ వేవ్
గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అదే జోష్‌లోనే సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినా, ఈసారి కూడా మోదీ పేరుతోనే దిల్లీ ఎన్నికల బరిలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దిల్లీలో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రధాన అస్త్రంగా ఆప్ 'స్కామ్స్'
ఆప్ నేతలు చేసిన 'స్కామ్స్' గురించి వివరిస్తూ ప్రజలను బీజేపీ ఆకట్టుకుంది. అంతే కాకుండా ఎన్నికలకు ముందు ఆప్, కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. వారి వెంట బీజేపీలోకి వచ్చిన క్యాడర్‌తో ఓటు బ్యాంకు చాలా వరకు పెరిగింది. దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే కేంద్ర ప్రభుత్వ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు స్థానికంగా అమల్లోకి వస్తాయనే అంశం ప్రజలను బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసింది.
ఒక్క ఓటరునూ వదలకుండా!
కొవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది దిల్లీ వదలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం, పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలిపించారు. అవసరమైతే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెప్పింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి దిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్ఠానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది.
తెలుగు ఓటర్ల కోసం టీడీపీ నేతలు
దిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా. వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలను వారితో టచ్‌లో ఉండేలా చెప్పింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా బీజేపీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిచింది.
గెలుపే లక్ష్యంగా అగ్రనేతల పర్యటనలు
దిల్లీలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేశారు. వీరికి తోడు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు ఇలా అందరూ దిల్లీలో మకాం వేశారు. బీజేపీని విజయ తీరాలకు చేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నించి గెలుపు దిశగా తీసుకెళ్లారు.
సంస్థగతంగా పక్కా ప్రణాళిక
బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయస్థాయి నాయకులకు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దష్టమైన బాధ్యతలు అప్పగించింది. ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని, అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలను ప్రకటిచింది. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ సాయం కూడా తీసుకుంది. ఈ ప్రచారా కార్యక్రమాల్లో పార్టీ నేతలకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు.