Delhi Polls AAP Loss Reasons : అవినీతి నిర్మూలనే ప్రచారాంశంగా దూసుకొచ్చిన ఆప్ గత మూడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. విద్య, వైద్యం, సంక్షేమంతో ప్రజలకు బాగా చేరువైంది. అయినప్పటికీ తాజాగా జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో చతికిలపడింది. బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పింది. అసలెందుకు ఆప్ ఎన్నికల్లో ఓడిపోయింది? అవినీతి ఆరోపణలే కొంపముంచాయా? వ్యుహాల్లో వెనుకపడిందా? ఆప్ ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం.
అవినీతి ఆరోపణలు
అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత మసకబారింది! కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడం కూడా ప్రతికూలంగా మారింది. అలాగే దిల్లీ సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కామ్ అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మసకబార్చాయి. ఈ అవినీతి ఆరోపణలు కూడా ఆప్ ఓటమికి ఓ కారణం అయ్యాయి.
యుమునా నది కాలుష్యం
దిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా యమునా నదిలో కాలుష్యం ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది. దీనిపైనే అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. తీవ్ర ఆరోపణలు చేశాయి. అలాగే దిల్లీలో వరదలను అరికట్టడంలో ఆప్ సర్కార్ విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఆప్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ వీడిన నేతలు
కైలాశ్ గహ్లోత్ సహా పలువురు ఆప్ అగ్రనేతలు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు మరింత పెరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అభ్యర్థుల స్థానచలనం
పాత నేతలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు ఆప్‌నకు తలనొప్పిగా మారింది. పాత నేతల్లో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అలాంటి స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా మారింది. కొంతమంది కీలక నేతలకు కేజ్రీవాల్ అసెంబ్లీ స్థానాలను మార్చారు. దీనివల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురైంది.
అభివృద్ధి
దిల్లీలో ఉచితాలు తప్ప అభివృద్ధి శూన్యమని విపక్షాలు ఆరోపించాయి. అందుకే నరేంద్ర మోదీ హయాంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ కే ఓటేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నినాదాన్ని విశ్వసించిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ దిల్లీ మోడల్‌తో ఓటర్లను ఆకర్షించినప్పటికీ, అది ఆశించిన మేర ఫలితాలనివ్వలేదని అర్ధం అవుతోంది.
ఫలించని దిల్లీ విద్యా విధానం!
దిల్లీ విద్యా విధానం, మొహల్లా క్లినిక్‌లపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. 'దిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆప్ అనుమతించడం లేదని విన్నాను. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతులకు పంపిస్తున్నారు' అని ప్రధాని దిల్లీ విద్యా విధానంపై ఆరోపణలు గుప్పించారు. ఇలా ఆప్ చేపట్టిన సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శల దాడి చేసింది. ఇవి ఈ ఎన్నికల్లో బాగా పనిచేసి ఆప్ ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాటర్ కనెక్షన్లు
దిల్లీలోని అన్ని ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు ఇస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఇప్పటి వరకు ఆప్ నేరవేర్చలేదని వాదనలు వినిపించాయి. దీంతో ప్రజలు ఆప్‌ను కాదని, బీజేపీకి జైకొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాలుష్యం
2020 మేనిఫెస్టోలో దిల్లీలో కాలుష్యాన్ని 60శాతం తగ్గిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. ఈ హామీని అమలు చేయడంలో ఆప్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా ఆప్‌ను దెబ్బకొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
దిల్లీకి రాష్ట్ర హోదా
దిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకొస్తానని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు. దీన్ని హామీ సాధించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ హామీ కూడా ఆప్‌ను దెబ్బకొట్టిందని తెలుస్తోంది.
ఉద్యోగాల కల్పనలో విఫలం
దేశ రాజధాని దిల్లీలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది. తమకు ఉద్యోగాల కల్పించడంలో ఆప్ సర్కార్ విఫలం అయిందని యువత ఆగ్రహంతో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆప్‌ను కాదని బీజేపీవైపునకు వారు మళ్లినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది.